
JD Vance To Be Next US President: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైట్ హౌస్ డాక్టర్ల బృందం చెప్తున్నా, పలువురు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలో బాధపడుతున్నారని చెప్తున్నారు. కాలి చీలమండల దగ్గర వాపు, కుడిచేతి వెనకాల కమిలిపోయిన గుర్తు, ఉబ్బిన కళ్లు, రంగుమారిపోయిన పెదవులు, నడిచేప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇవి తీవ్రమైన గుండె వ్యాధి, దానికి వాడే మందుల దుష్ప్రభావాల లక్షణాలంటున్నారు.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు
రీసెంట్ గా అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆహ్వానించే సమయంలో.. ట్రంప్ కార్పెట్‌పై నేరుగా కాకుండా, కాస్త తూలుతున్నట్టుగా అటూ ఇటూ నడుస్తూ వచ్చారు. అదే సమయంలో ట్రంప్ కుడిచేతిపై మచ్చ కనిపించింది. రక్తాన్ని పలుచన చేసే ఆస్ర్పిన్ వాడుతున్న ట్రంప్.. ఇటీవల చాలా మందిని కలసి కరచాలనం చేయడంతో చర్మం రాపిడికి గురై మచ్చ ఏర్పడిందని వైట్ హౌస్ డాక్టర్ సియాన్ బార్బబెల్లా వివరించారు. ట్రంప్ వయసు ప్రస్తుతం 79 ఏళ్లు అని, ఈ వయసులో ఇలాంటి సమస్యలు సాధారణమేనన్నారు.
ఉపాధ్యక్షుడు వాన్స్ కీలక వ్యాఖ్యలు
ఇక తాజాగా ట్రంప్ ఆరోగ్యంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఆరోగ్యం బాగుందన్నారు. ట్రంప్ తన పదవీ కాలం పూర్తయ్యే వరకు దేశాధ్యక్షుడిగా సేవలందిస్తారని, అమెరికా ప్రజల కోసం గొప్ప పనులు చేస్తారని చెప్పారు. అవసరమైతే దేశాధ్యక్ష పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అని అడిగినపుడు వాన్స్ బదులిస్తూ, 200 రోజుల్లో ఉపాధ్యక్ష పదవిలో తాను పొందిన అనుభవం తనను బాధ్యత తీసుకోవడానికి సిద్ధం చేసిందన్నారు.