
IDPL: హైదరాబాద్ నగరంలో రాజకీయంగా, పరిపాలనా పరంగా కీలకంగా మారిన ఐడీపీఎల్ భూముల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కూకట్‌పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376లో ఉన్న, సుమారు రూ.4 వేల కోట్ల విలువైన ఐడీపీఎల్ భూములపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల కబ్జాపై పరస్పర ఆరోపణలు తీవ్రస్థాయికి చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఐడీపీఎల్ భూముల విషయంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూముల కబ్జాకు పాల్పడ్డారని, భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని జాగృతి జనం భాట కార్యక్రమంలో భాగంగా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. విలువైన ఐడీపీఎల్ భూములపై వస్తున్న కబ్జా ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరపాలని నిర్ణయించింది. కూకట్‌పల్లిలో ఉన్న ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కు చెందిన భూముల వాస్తవ పరిస్థితి ఏమిటి?, యాజమాన్య హక్కులు ఎవరివి?, గతంలో జరిగిన లావాదేవీలు ఏవీ? అనే అంశాలపై విజిలెన్స్ విచారణ జరగనుంది.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ నిర్ణయాన్ని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వాగతించారు. ఈ భూములపై విచారణ జరిపించాలని తానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఐడీపీఎల్ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలను ఇప్పటికే ప్రభుత్వానికి అందించానని పేర్కొన్నారు. తన అభ్యర్థన మేరకే ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని వ్యాఖ్యానిస్తూ, ఈ విచారణలో అక్రమాలు, కబ్జాలకు పాల్పడింది ఎవరో స్పష్టంగా బయటపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఐడీపీఎల్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ గా గతంలో దేశవ్యాప్తంగా ఔషధాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉన్న ఈ సంస్థ భూములు కాలక్రమేణా అత్యంత విలువైన ఆస్తులుగా మారాయి. సంస్థ బలహీనపడటం, కార్యకలాపాలు తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ భూములు దశాబ్దాలుగా వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ భూములుగా ఉండటంతో యాజమాన్య హక్కులు, వినియోగంపై స్పష్టత లేకపోవడం, భూముల విలువ పెరగడం వల్ల కబ్జాల ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి. గతంలోనూ ఐడీపీఎల్ భూములపై అనేక ఫిర్యాదులు, రాజకీయ ఆరోపణలు వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో, ఈ భూములపై వాస్తవ పరిస్థితి ఏమిటన్నది అధికారికంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
విజిలెన్స్ విచారణలో భూముల రికార్డులు, లీజులు, అనుమతులు, గతంలో జరిగిన ఒప్పందాలు అన్నింటినీ పరిశీలించనున్నారు. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. దీంతో ఐడీపీఎల్ భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
ALSO READ: BIG NEWS: రైతులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.15,000 జమ





