iBomma Restaurants: టెక్నాలజీ మీద ఉన్న పట్టుతో కొత్త సినిమాలను పైరసీ చేస్తూ, సినిమా పరిశ్రమకు చుక్కలు చూపించిన ఐబొమ్మ రవికి పోలీసులు క్రేజీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడి తెలివి తేటలను గుర్తించి పోలీసుశాఖలో ఉద్యోగాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో ఉన్నతాధికారులు, పోలీసు శాఖలోకి రావాలని కోరినట్లు సమాచారం. సెంట్రల్ క్రైమ్ విభాగంలో పని చేయాలని కోరారట. మంచి జీతం కూడా ఇస్తామన్నారట. రవి మాత్రం వారి ఆఫర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. తన ఫ్యూచర్ ప్లాన్స్ వేరే ఉన్నట్లు చెప్పాడు.
కరేబియన్ దీవుల్లో ‘ఐబొమ్మ’ రెస్టారెంట్
విచారణ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించాడు రవి. తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పాడు. కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ, ఆంధ్రాతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపించాలని భావిస్తున్నట్లు చెప్పాడు. రెస్టారెంట్ కు ఏం పేరు పెడతావని పోలీసులు ప్రశ్నించగా.. ఐ బొమ్మ పేరే పెడతానని రవి చెప్పాడట. కొద్ది రోజుల్లోనే కరేబియన్ దీవుల్లోని అన్ని దేశాల్లో ఐ బొమ్మ రెస్టారెంట్ బ్రాంచీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. భారత వంటకాలకు అక్కడి ప్రజలు అలవాటు పడేలా చేస్తానన్నాడు.
రవికి కరేబియన్ కంట్రీ పౌరసత్వం
ఐ బొమ్మ రెస్టారెంట్‌తో వచ్చే డబ్బుతో జీవితాన్ని హ్యాపీగా గడపడమే లక్ష్యం అని చెప్పాడు రవి. ఇప్పటికే లక్ష డాలర్లు ఖర్చు చేసి కరేబియన్ దేవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. ఇప్పటి వరకు సంపాదించిన రూ.20 కోట్లలో ఎంజాయ్ చేయడానికే రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇకపై కూడా తాను అనుకున్నట్లుగానే వారానికో దేశాలు తిరుగుతూ తనకు నచ్చినట్లు, హాయిగా గడుపుతానని చెప్పాడట. అటు రవి ఖాతాల్లో దొరికిన రూ.3 కోట్ల డబ్బుతో పాటు హైదరాబాద్ లోని ఫ్లాటు, విశాఖపట్నంలో ఉన్న ఆస్తులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెప్పడం విశేషం.





