తెలంగాణ

ఇక అసెంబ్లీకి రాను: కోమటిరెడ్డి

  • వరద బాధితులకు అండగా ఉంటా

  • ఆపద సమయంలో ఆపన్నహస్తం అందిస్తా

  • కామారెడ్డిలో పర్యటిస్తా: రాజగోపాల్‌రెడ్డి

  • కొంతకాలంగా రేవంత్‌ సర్కార్‌ పట్ల కోమటిరెడ్డి గుర్రు

  • కాళేశ్వరం కమిషన్‌పై అసెంబ్లీలో జరగనున్న చర్చ

  • ఈ సమయంలో రాజగోపాల్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఉత్కంఠ

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్: ఇకపై తాను అసెంబ్లీలో అడుగుపెట్టబోనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో గన్‌ పార్క్‌ వద్దకు తన మద్దతుదారులతో కోమటిరెడ్డి చేరుకున్నారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కొంతకాలంగా రేవంత్‌రెడ్డి సర్కార్‌పై రాజగోపాల్‌ రెడ్డి గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. మంత్రి పదవి దక్కకపోవడంతో కోమటిరెడ్డి నేరుగా రేవంత్‌ను టార్గెట్‌ చేసి తీవ్ర విమర్శలు కూడా చేశారు. రాజగోపాల్‌తో పాటు మరికొందరికి కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో వారుకూడా విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు రేకెత్తాయి కాగా, కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్‌లో ఇవాళ రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరోసారి దుమారం రేపాయి.

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమయంలో అసెంబ్లీలో కూర్చోవడం సరికాదని తాను భావిస్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనదలుచుకోలేదని పేర్కొన్నారు. కామారెడ్డి, మెదక్‌, ఉమ్మడి కరీంనగర్‌లో వరదలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు అండగా నిలబడతానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బాధితులను కలిసి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేస్తానని అన్నారు.

కాగా, రాజగోపాల్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై రాజకీయ నాయకులు, విశ్లేషకుల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది. మంత్రి పదవి దక్కకపోవడంతో, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉండేందుకే కోమటిరెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. మునుగోడుకు నిధుల విషయంలో, ట్రిపుల్‌ ఆర్‌ రైతుల సమస్యలపై రాజగోపాల్‌ ప్రభుత్వ వైఖరి తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కాళేశ్వరం కమిషన్‌ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య హాట్‌హాట్‌ చర్చ జరిగే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో రాజగోపాల్‌ అసెంబ్లీకి రాబోను అనడం చర్చకు దారితీసింది.

Read Also:

  1. రుషికొండ ప్యాలెస్… పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
  2. పవన్‌ను వెంటాడుతున్న సుగాలి ప్రీతి కేసు.. అసలు ఏం జరిగింది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button