Madras High Court On Live-in Relationship: సహజీవన సంబంధాలకు సంబంధించిన అంశంలో మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవన సంబంధాల్లో, మహిళలకు ప్రేమ వివాహం కింద భార్య హోదా కల్పించడం ద్వారా వారిని రక్షించాలని మధురై ధర్మాసనం అభిప్రాయపడింది. అప్పుడే ఆ సంబంధంలో సమస్యలున్నా, ఆమె భార్య హోదాతో తట్టుకోగలుగుతుందని పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని మాయమాటలతో నమ్మించి సహజీవనం చేసిన ఓ యువకుడు ముందస్తు బెయిలు కోరుతూ దాఖలుచేసిన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ శ్రీమతి ఈ వ్యాఖ్యలు చేశారు.
8 రకాల వివాహాల్లో ప్రేమ వివాహం ఒకటి
ప్రాచీన భారతదేశంలో ఉన్న 8 రకాల వివాహాల్లో ఒకటి గాంధర్వ వివాహమని న్యాయమూర్తి శ్రీమతి అభిప్రాయపడ్డారు. ప్రేమ వివాహం కూడా దాని కిందికే వస్తుందన్నారు. సహజీవన సంబంధాలను ఆ వివాహాలుగా గుర్తించవచ్చన్నారు. అమ్మాయిలు తాము ఆధునికులమని భావించి సహజీవన సంబంధాన్ని ఎంచుకుంటున్నారన్న ఆమె.. కొంతకాలం తర్వాత వివాహం ద్వారా లభించే రక్షణ ఏదీ సహజీవనంలో లభించదని వారు గ్రహించినప్పుడు, వాస్తవం నిప్పులా వారిని దహించడం ప్రారంభిస్తుందన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో మహిళలకు రక్షణ కల్పించేది బీఎన్‌ఎస్లోని సెక్షన్ 68 మాత్రమే. ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో పురుషులు బీఎన్‌ఎస్ సెక్షన్ 69 కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.





