
Sexual Assault: ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో పరిచయాలు, ఆ పరిచయాల ముసుగులో అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఓ యువతిని బర్త్ డే చేసుకుందామని తన రూమ్ కు పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఘటనపై పోలీసులు విచారణ జరపుతున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
నల్లగొండకు చెందిన సిద్ధార్ధరెడ్డి(24) హైదరాబాద్ బాలానగర్ లో ఉంటున్నాడు. అతడికి నెల రోజుల క్రితం మణికొండకు చెందిన 25 ఏళ్ల యువతి ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది. ఇద్దరు కొద్ది రోజుల్లోనే బాగా ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరు ఫోన్ లో చాటింగ్, టాకింగ్ అంటూ సరదాగా గడిపారు. జూలై 30న ఆమె బర్త్ డే. ఆ విషయం అతడికి చెప్పింది. బర్త్ డే పార్టీ చేసుకుందాం రూమ్ కు రావాలని చెప్పాడు. అంతేకాదు, 29న రాత్రి సదరు యువతి కోసం క్యాబ్ బుక్ చేశాడు. సరే, అని ఆమె అతడి గదికి వెళ్లింది. కాసేపు ఇద్దరూ సరదాగా గడిపారు. బిర్యానీ తెచ్చుకుని తిన్నారు. ఇద్దరూ కలిసి మద్యం కూడా తాగారు. ఆ తర్వాత అసలు కథ మొదలయ్యింది. మద్యం మత్తులో అతడు ఆమెపై అత్యాచారం చేశాడు.
తెల్లవారుజామున 4 గంటలకు 100కు ఫోన్
బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు బాధితురాలు సిద్ధార్థరెడ్డి ఇంటి నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. స్పాట్ కు చేరుకున్న పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు వెల్లడి అవుతాయని పోలీసులు వెల్లడించారు.
Read Also: ధర్మస్థలలో కొనసాగుతున్న తవ్వకాలు, ఇంతకీ ఆ అస్థిపంజరం ఎవరిది?