
హైదరాబాద్ లో బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసిన పోలీసులకు చిక్కిన సిరాజ్, సమీర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. పోలీసుల విచారణలో ఈ ఇద్దరు నిందితులకు పాక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మాడ్యూల్స్ తో సంబంధాలు ఉన్నట్లు తేలింది. సౌదీ అరేబియా మాడ్యూల్స్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సమీర్, సిరాజ్ ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు.
గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధం కావాలనే కారణంతో సిరాజ్ విజయనగరం నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఆ సమయంలోనే అతడు, సమీర్ పలుమార్లు కలిసి చర్చించుకున్నారు. అనంతరం సిరాజ్ గ్రూప్-2 పరీక్ష రాసేందుకు విజయనగరం వెళ్లిపోయాడు. పేలుళ్ల రిహార్సల్స్ కోసం విజయనగరంలోని తన చిరునామాకే ఆన్‌లైన్‌లో పేలుడు రసాయనాలను తెప్పించుకున్నాడు. వీరి కార్యకలాపాలపై ఉప్పు అందడంతో నిఘా ఉంచిన తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు.. ఏపీ పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో శనివారం విజయనగరంలో పోలీసులు సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటెలిజెన్స్ అధికారులు సికింద్రాబాద్‌లో సమీర్‌ను అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారంట్‌పై విజయనగరం తీసుకెళ్లారు.
హ్యాండ్లర్ వీరిని ‘మ్యాజిక్‌లాంతర్’ ద్వారా ఎంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సోషల్ మీడియాలో ఉగ్రవాద అనుకూల పోస్టు పెట్టి, దానికి సానుకూలంగా స్పందించే (లైక్‌మైండెడ్) వారిని ఎంచుకోవడమే ఈ ప్రక్రియ ముఖ్యఉద్దేశం. అలాంటి వారిలో నుంచే వీరిద్దరినీ ఎంచుకున్నట్లు తేలింది. వీరు తమ గ్రూపులో మరో 28 మందిని చేర్చుకున్నట్లు గుర్తించారు. అగ్గిపుల్లల్లోని మందును వినియోగించి బాంబు తయారు విధానంపై హ్యాండ్లర్ వీరికి ఫైళ్లు పంపినట్లు తేలింది. దీనికి అనుగుణంగానే యువకులు బాంబును తయారు చేసినట్లు తేలింది. ఆ బాంబును సిరాజ్ ఈ నెల 12న విజయనగరంలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. మరోసారి ప్రయోగించేందుకు సిద్ధమైన తరుణంలోనే వారిద్దరూ పోలీసులకు చిక్కారు.