
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తనతో శృంగారానికి నిరాకరిస్తుందనే కోపంతో ఓ వ్యక్తి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ఇండోర్ నగరంలో సంచలనం సృష్టించింది. ఎనిమిదేళ్లుగా దాంపత్య జీవితంలో విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పుకుంటూ, కోపావేశంలో భర్త ఈ ఘోరానికి పాల్పడ్డాడు.
ఇండోర్‌లోని ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 9న 40 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమెను ముందుగా భర్తే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఒక్కసారిగా తిరిగి పడిపోయిందని, హై బీపీ కారణంగానే మృతి చెందిందని వైద్యులకు, పోలీసులకు చెప్పాడు. అయితే మహిళ మృతి తీరుపై పోలీసులకు మొదటి నుంచే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా అసలు నిజం బయటపడింది. మహిళ గొంతునులిమి హత్య చేయబడినట్లు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో కేసు దిశ పూర్తిగా మారిపోయింది. భర్తపై అనుమానాలు బలపడటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. తాను మెకానిక్‌గా పనిచేస్తున్నానని, గత ఎనిమిదేళ్లుగా భార్య తనతో శృంగారానికి నిరాకరిస్తోందని చెప్పాడు. ఇదే విషయంపై తరచూ ఇంట్లో గొడవలు జరిగేవని, ఆ కోపమే చివరకు హత్యకు దారి తీసిందని అంగీకరించాడు.
డీసీపీ శ్రీకృష్ణ లాల్‌చందానీ మీడియాతో మాట్లాడుతూ.. మొదట భర్త చెప్పిన మాటలకు పోస్టుమార్టం నివేదికకు పూర్తిగా పొంతన లేదని తెలిపారు. మహిళను గొంతునులిమి చంపినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
దాంపత్య జీవితంలో చిన్నచిన్న విభేదాలు ఎలా ఘోర నేరాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి చూపిస్తోంది. ప్రస్తుతం నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ALSO READ: Shocking: చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలి కన్ను కోల్పోయిన చిన్నారి! (VIDEO)





