
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషనే ఒక హత్యకు వేదిక కావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. భార్య మరొకరితో వెళ్లిపోయిందన్న కోపం, ఆవేశం ఒక వ్యక్తిని హంతకుడిగా మార్చింది. పోలీసుల కస్టడీలో ఉన్న తన భార్యను పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కాల్చి చంపిన ఘటన హర్దోయ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన పోలీసు వ్యవస్థలోని భద్రతా లోపాలను బహిర్గతం చేసింది.
यूपी के हरदोई में इस शख्स ने थाने के अंदर अपनी पत्नी की गोली मारकर हत्या कर दी.
इस युवक की पत्नी पांच दिन पहले अपने प्रेमी के साथ घर से चली गई थी. इसने थाने में प्राथमिकी दर्ज करायी थी, और आरोप लगाया था कि पत्नी घर से जेवर और 35 हजार नकद लेकर गयी है.
इसी मामले में पुलिस ने… pic.twitter.com/bumtxUgE62
— Priya singh (@priyarajputlive) January 12, 2026
అనుప్, సోని దంపతులకు 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ జీవితం సాగుతున్న సమయంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నెల 7వ తేదీన సోని తన భర్తను వదిలి సుర్జీత్ అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన అనుప్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి జనవరి 11న సోనిని గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను పాలి పోలీస్ స్టేషన్‌కు తరలించి అధికారికంగా పోలీస్ కస్టడీలో ఉంచారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ లోపలే ఊహించని దారుణం జరిగింది. టిఫిన్ కోసం స్టేషన్‌లోని క్యాంటీన్ వైపు వెళ్తున్న సోనిపై ఆమె భర్త అనుప్ ఒక్కసారిగా దాడి చేశాడు. ముందుగానే అక్కడ మాటు వేసిన అతడు తన వద్ద ఉన్న తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన సోనిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఈ హత్య జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిందితుడు ఆయుధంతో స్టేషన్‌లోకి ఎలా ప్రవేశించాడన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రవేశ సమయంలో తనిఖీలు చేయలేదా? పోలీస్ కస్టడీలో ఉన్న మహిళకు సరైన భద్రత కల్పించలేదా? నిందితుడికి ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది? అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఘటనపై హర్దోయ్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మీనా తీవ్రంగా స్పందించారు. నిందితుడు అనుప్‌ను ఆయుధంతో సహా వెంటనే అరెస్టు చేసినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాన్ని పంపించి ఆధారాలు సేకరించామని వెల్లడించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 17 ఏళ్ల దాంపత్య బంధం అనుమానాలు, ఆవేశంతో రక్తపాతం కావడం విషాదాన్ని మిగిల్చింది. ఒక మహిళ ప్రాణం కోల్పోవడమే కాకుండా, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి కూడా ఈ ఘటన పెద్ద దెబ్బగా మారింది.
ALSO READ: కాంగ్రెస్‌లోకి కవిత.. పీసీసీ చీఫ్ క్లారిటీ





