
విదేశాల్లో పీహెచ్డీ చేయాలని కలలు కనే విద్యార్థులకు కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయం గుడ్న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే పరిశోధకులను ఆకర్షించేందుకు భారీ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ఏకంగా 100 మిలియన్ కెనడియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసింది. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.956 కోట్లకు సమానం.
‘ప్రెసిడెంట్స్ ఇంపాక్ట్ స్కాలర్షిప్స్’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీని కింద ఎంపికయ్యే ప్రతి పీహెచ్డీ విద్యార్థికి ఏడాదికి 80 వేల కెనడియన్ డాలర్లు అందుతాయి. నాలుగేళ్ల పాటు ఈ ఆర్థిక సహాయం కొనసాగుతుంది. అంటే ఒక్కో విద్యార్థికి మొత్తం 3.2 లక్షల కెనడియన్ డాలర్లు లభిస్తాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.3.08 కోట్లకు సమానం.
ఈ కార్యక్రమం ద్వారా కెనడాకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రతిభావంతులైన పరిశోధకులను తీసుకురావాలని విశ్వవిద్యాలయం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా అమెరికా నుంచి బయటకు వెళ్లి ఇతర దేశాల్లో ఉన్నత విద్య, పరిశోధన కొనసాగించాలనుకునే విద్యార్థులను కూడా ఆకర్షించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
స్కాలర్షిప్ పొందే విద్యార్థులు ఇద్దరు అధ్యాపకుల మార్గదర్శకత్వంలో పరిశోధనలు చేయనున్నారు. ఒకే విభాగానికి పరిమితం కాకుండా విభిన్న రంగాలను అనుసంధానం చేస్తూ పరిశోధనలు చేపట్టే అవకాశాన్ని వారికి కల్పించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సంక్లిష్ట సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుగొనే పరిశోధనలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని విశ్వవిద్యాలయం వెల్లడించింది.
ఈ భారీ స్కాలర్షిప్ కార్యక్రమానికి నిధుల కోసం కెనడాకు చెందిన ఓ ఫ్యామిలీ ఫౌండేషన్ 50 మిలియన్ కెనడియన్ డాలర్లను విరాళంగా అందించింది. దీనికి సమాన మొత్తాన్ని టొరంటో విశ్వవిద్యాలయం సమకూర్చింది. దీంతో ఈ కార్యక్రమానికి అందుబాటులో ఉన్న మొత్తం నిధి 100 మిలియన్ డాలర్లకు చేరింది.
2027 సెప్టెంబర్ నుంచి ఈ స్కాలర్షిప్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది 12 నుంచి 13 మంది కొత్త పీహెచ్డీ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి నాలుగేళ్ల పాటు ఆర్థిక సహాయం అందించనున్నారు. నాలుగో సంవత్సరం నాటికి మొత్తం 50 మంది స్కాలర్లకు ఈ ప్రయోజనం అందేలా ప్రణాళిక రూపొందించారు. ఆ తర్వాత కూడా 50 మంది విద్యార్థులకు నిరంతరం స్కాలర్షిప్ అందే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు.
కెనడాలోని ప్రముఖ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో టొరంటో విశ్వవిద్యాలయం ఒకటి. 2027 క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్లో ఈ వర్సిటీ 32వ స్థానాన్ని సాధించింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ సంస్థలో పీహెచ్డీ చేసే అవకాశం కోసం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఆసక్తి చూపే అవకాశం ఉంది.
also read: బెంగళూరులో సంచలనం.. ఖైదీ భార్యపై లైంగిక దాడి, నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఖైదీ విడుదల