కొద్ది రోజుల క్రితం వచ్చిన మొంథా తుఫాను కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరి, పత్తి పంటలతో పాటు వేలాది ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరల పంటలు ధ్వంసం అయ్యాయి. దిగుబడి భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మార్కెట్లలో ఆకు కూరలు, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. డిమాండ్ కు తగినట్లుగా సరఫరా లేకపోవడంతో వ్యాపారులు ధరలను భారీగా పెంచారు. ఈ కూరగాయల ధరలు చూసినా రూ. 80 పలుకుతున్నాయి. చిక్కుడు, బీన్స్ లాంటి ధరలు ఏకంగా సెంచరీ కొడుతున్నాయి.
రూ. 100 దాటిని కూరగాయల ధరలు
తుఫాను తర్వాత రిటైల్ మార్కెట్ లో ఏ రకం కూరగాయలు అయినా కిలో రూ.70కి పైనే పలుకుతుంది. కొన్ని రకాల కూరగాయలు రూ. 100 దాటాయి. గత నెలలో కిలో టమోటా రూ.20కు పడిపోగా, ప్రస్తుతం రూ.60 పలుకుతోంది. కిలో చిక్కుడు రూ.120కు అమ్ముతున్నారు. పచ్చిమిర్చి రూ.60, బెండ, దొండ, బీర, కాకర, వంకాయ వంటివి కిలో రూ.80 చెబుతున్నారు. క్యారెట్, బీట్‌రూట్, క్యాప్సికం, బీన్స్ రూ.80-100 పలుకుతున్నాయి. దోసకాయ రూ.60 దాకా చెప్తున్నారు. పొట్లకాయ, సొరకాయ సైజును బట్టి రూ.40పైనే ఉంటున్నాయి.
ఇవే రకాలు రైతుబజార్లలో కాస్త తక్కువగా ఉన్నా.. అక్కడ రెండో మూడో రకాలే ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు. అయినా బహిరంగ మార్కెట్‌లో భారీ ధరలకు కూరగాయలు కొనలేని సామాన్యులు పట్టణాలు, నగరాల్లోని రైతుబజార్లకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కూరగాయల ఉత్పత్తి తగ్గడంతో రైతుబజార్లలోనూ మామూలుగా కన్నా ధర ఎక్కువగానే ఉంటోందని కొనుగోలుదారులు చెప్తున్నారు. ఇదే సమయంలో కొందరు అయ్యప్ప, భవానీ, శివమాలలు ధరించడం వల్ల శాకాహారంగా కూరగాయల వినియోగం పెరిగింది.
గుడ్లు, చికెన్ ధరలు కూడా పెంపు
అటు కార్తీక మాసం ముగియడంతో మళ్లీ మాంసాహారం వైపు మళ్లారు. ఇప్పుడు చికెన్ రేట్లు రూ. 220 నుంచి రూ. 260 వరకు పలుకుతున్నాయి. అటు ట్రే ఎగ్స్ (30) ధర ఏకంగా రూ. 210 వరకు పలుకుతుంది.





