కొన్నిసార్లు కేసులో చిన్న చిన్న అంశాలే క్లూగా మారుతాయి. పెద్ద నేరాలకు పాల్పడిన నిందితులను పట్టిస్తాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఓ హత్య కేసులో జస్ట్ చిన్న ఆమ్లెట్ ముక్కతో సాల్వ్ అయ్యింది. హంతకుడిని కటకటాల్లోకి వెళ్లేలా చేసింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
డిసెంబర్ 29వ తేదీన గ్వాలియర్‌లోని కటారే ఫామ్ హౌస్ దగ్గర పొదల్లో ఓ మహిళ శవం కనిపించింది. పోలీసులు వెళ్లి చూసే సరికి అర్థ నగ్నంగా పడిఉంది. ముఖం గుర్తు పట్టలేనంతగా రాయితో చెక్కేశారు. పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించి దర్యాప్తు మొదలుపెట్టారు.
అత్యాచారం చేసి హత్య
మహిళను చంపే ముందు ఆమెపై అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. పోలీసులు ఏఐ సాయంతో మహిళ ముఖాన్ని క్రియేట్ చేశారు. ఆమె ఎవరో గుర్తించే ప్రయత్నం మొదలు పెట్టారు. అటు మృతురాలు చనిపోయినప్పుడు స్వెటర్ ధరించి ఉంది. ఆ స్వెటర్ జేబులో చిన్న ఆమ్లెట్ ముక్క దొరికింది. పోలీసులు దాని సాయంతో కేసును ముందుకు నడిపించారు. ఆమ్లెట్‌లు తయారు చేసి అమ్మే వారి దగ్గరకు వెళ్లారు. మహిళ ఫొటో చూపించి ఎంక్వైరీ చేశారు. ఓ వ్యాపారి ఆ మహిళ, మరో ఇద్దరు వ్యక్తులతో తన షాపులోనే ఆమ్లెట్ తిన్నదని చెప్పాడు.
సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడి గుర్తింపు
పోలీసులు షాపు దగ్గరలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. హజీరా ఏరియాకు చెందిన సచిన్ సేన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తికమ్‌ఘర్‌కు చెందిన ఆ మహిళతో కొన్ని నెలల క్రితం సచిన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే, ఆమె తనతోనే కాకుండా వేరే వాళ్లతో కూడా సన్నిహితంగా ఉందని సచిన్ అనుమానించాడు. ఆ అనుమానంతోనే ఆమెను చంపేశాడు. ఆమ్లెట్ తిన్న తర్వాత సదరు మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపేశాడు. పోలీసులు సచిన్‌ను అరెస్ట్ చేశారు.





