
Hollywood: వరల్డ్ సినీ ప్రేమికుల్ని మరోసారి పండోరా గ్రహానికి తీసుకెళ్లేందుకు జేమ్స్ కామెరాన్ సిద్ధమయ్యారు. ఆయన సృష్టించిన అవతార్ సిరీస్‌లో తాజా భాగం ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ చుట్టూ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా హడావిడి మొదలైంది. థియేటర్లలో ఈ సినిమా ఎప్పుడు అడుగుపెడుతుందా, పండోరా ప్రపంచాన్ని మరోసారి ఎప్పుడు అనుభవిస్తామా అనే ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ అంచనాలకు అద్దం పట్టేలా అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. బుకింగ్స్ వేగం చూస్తే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల ప్రముఖ హాలీవుడ్ రివ్యూ సంస్థలైన రోటెన్ టొమాటోస్, ఐజిఎన్ లాంటి సంస్థలు ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’పై తమ ప్రాథమిక సమీక్షలను విడుదల చేశాయి. ఈ రివ్యూస్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. అవతార్ పార్ట్ వన్, పార్ట్ టూ ఎలా అయితే విజువల్‌గా ప్రేక్షకులకు కనుల విందు చేశాయో, ఈ మూడో భాగం కూడా అదే స్థాయిలో విజువల్ ఫీస్ట్‌ను అందిస్తుందని సమీక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, కెమెరా వర్క్, టెక్నికల్ టేకింగ్ విషయంలో జేమ్స్ కామెరాన్ మరోసారి తన సత్తా చాటారని ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే కథ పరంగా ఈసారి పెద్దగా కొత్తదనం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. టెక్నాలజీ, విజువల్ గ్రాండ్యూర్‌పై చూపిన శ్రద్ధ కథలోని భావోద్వేగాలను మరింత బలంగా ఆవిష్కరించడంలో పూర్తిగా కనిపించలేదని కొన్ని రివ్యూ సంస్థలు పేర్కొన్నాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నా, కథలో ఆశించినంత ఎమోషనల్ డెప్త్ లేదని రోటెన్ టొమాటోస్, ఐజిఎన్ వంటి సంస్థలు తమ రివ్యూల్లో స్పష్టం చేశాయి.
ఈ రివ్యూస్ బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానుల స్పందనలు హోరెత్తుతున్నాయి. జేమ్స్ కామెరాన్ సినిమాలకు రివ్యూలతో పనిలేదని, థియేటర్‌లో సినిమా చూస్తేనే అసలు మ్యాజిక్ తెలుస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈనెల 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వెండితెరపై మరోసారి కామెరాన్ మాయాజాలం ఆవిష్కృతం కాబోతుందని సోషల్ మీడియా నిండా చర్చ జరుగుతోంది. తెలుగులో కూడా ఈ సినిమా భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల కానుండటంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మరింత పెరిగింది.
ఇదిలా ఉండగా, అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలకు ముందు జేమ్స్ కామెరాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ప్రదర్శించబోయే థియేటర్ యజమానులు, టెక్నీషియన్లకు ఆయన ప్రత్యేక లేఖ రాశారు. ఆ లేఖలో ఈ సినిమాతో పాటు పంపిన డీసీపీకి సంబంధించి ప్రొజెక్షన్ స్పెసిఫికేషన్ ఫైల్, ఫ్రేమింగ్ చార్ట్‌లను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విజువల్ అనుభూతిని తగ్గించేలా ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా లైట్ లెవల్స్, ఆడియో కాన్ఫిగరేషన్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కామెరాన్ కోరారు. ఈ సినిమా కోసం ఉపయోగించిన సౌండ్ సిస్టమ్‌ను తానే వ్యక్తిగతంగా మిక్స్ చేశానని వెల్లడించారు. పూర్తి అనుభూతి కోసం 7.0 రిఫరెన్స్ సౌండ్ లెవల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించవద్దని థియేటర్లకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. థియేటర్ల నిర్వహణే ప్రేక్షకుల అనుభూతిలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆ విషయంలో ఎలాంటి రాజీపడకూడదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఇక ఈ లేఖ కూడా అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజువల్స్ మాత్రమే కాదు, సౌండ్ డిజైన్‌లోనూ ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ కొత్త ప్రమాణాలను స్థాపించబోతోందన్న అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తానికి జేమ్స్ కామెరాన్ మరోసారి ప్రపంచ సినీ అభిమానులను పండోరా గ్రహానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. థియేటర్‌లో ఈ సినిమా ఎలా మ్యాజిక్ చేస్తుందో చూడాలంటే విడుదల రోజు వరకూ ఎదురుచూడాల్సిందే.
ALSO READ: Winter: వాటర్ హీటర్ వాడుతున్నారా..?





