
HMDA News : హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ పరిధిని విస్తరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలను చేర్చింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని మండలాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చింది. వీటిని చేర్చడం ద్వారా కొత్తగా హెచ్ఎండీఏ పరిధిలోకి 3 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం చేరనుంది. తాజా పెంపుతో హెచ్ఎండీఏ పరిధిలో మొత్తంగా 11 జిల్లాలు, 104 మండలాలు, 1,350 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏను విస్తరించనున్నారు.
హైదరాబాద్ కోసం 2031 మాస్టర్ ప్లాన్ (Master Plan) ఇప్పటి వరకు అమల్లో ఉంది. దీనికి మరో 25 ఏళ్లు జోడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్ఎండీఏ విస్తీర్ణం పెరగడంతో భూముల రేట్లలో భారీగా మార్పులు రానున్నాయి. అభివృద్ధి కూడా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనుంది. విస్తరణ తర్వాత హెచ్ఎండీఏ పరిధి 10,472.72 చదరపు కిలోమీటర్లకు చేరింది.
హైదరాబాద్ తోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడాని (HUDA) 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణయంలో ఏర్పాటు చేశారు. 2008లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం హుడాను హెచ్ఎండీఏగా మార్చింది. ఆ తర్వాత హెచ్ఎండీఏ పరిధి 7257 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అనంతరం జరిగిన విస్తరణలతో హెచ్ఎండీఏ పరిధి 10,472 చదరపు కిలోమీటర్ల చేరింది. సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ మహా నగరం విస్తరణలో హెచ్ఎండీఏ కీలకంగా వ్యవహరిస్తోంది. ట్రిపుల్ ఆర్ తో భూముల ధరలు ఇప్పటికే పెరగ్గా.. ఇప్పుడు హెచ్ఎండీఏ విస్తరణ తర్వాత కొత్తగా కలిసిన జిల్లాల్లోనూ రియల్ ఎస్టేట్ మరింత పుంజుకునే అవకాశం ఉంది.