
History: భారతదేశం ఎన్నో మతాలకు పుట్టినిల్లు కాకపోయినా.. అనేక మతాలు ఇక్కడ తమ స్థానం ఏర్పరుచుకున్నాయి. అందులో ఇస్లాం, క్రైస్తవం, యూదు మతాల చరిత్ర ప్రత్యేకమైన మలుపులను కలిగి ఉన్నాయి. ఈ మతాలు భారత్‌లో మొదట నిలిచిన ప్రదేశం కేరళ కావడం ఒక విశేషం. సముద్ర మార్గం ద్వారా ప్రపంచంతో సంబంధాలు కొనసాగించిన మొదటి భారత రాష్ట్రం కూడా ఇదే కావడం, విదేశీ మతాల ప్రవేశానికి ఇది ద్వారమయ్యింది. కేరళ ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో ఇచ్చిన వివరాల ప్రకారం.. భారత్‌లో తొలి మసీదు, తొలి చర్చి రెండూ కేరళలోనే నిర్మించబడ్డాయి. ఈ కారణంగా కేరళ ఆధ్యాత్మిక వైవిధ్యానికి ప్రతీకగా నిలిచింది.
భారత ఉపఖండంలోని తొలి మసీదు త్రిస్సూర్ జిల్లాలో ఉన్న చేరమాన్ జుమా మసీదు. దీన్ని క్రీ.శ. 629 సంవత్సరంలో మాలిక్ ఇబ్న్ దీనార్ నిర్మించినట్లు చారిత్రక పత్రాలు సూచిస్తున్నాయి. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే రెండవ పురాతన మసీదుగా కూడా భావించబడుతుంది. ఈ మసీదు నిర్మాణశైలి కూడా ఆశ్చర్యకరమే. ఇది సాధారణంగా చూసే అరబ్ శైలిలోని మసీదుల్లా కాకుండా, కేరళ సంప్రదాయ దేవాలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఆ కాలంలో స్థానిక శిల్పకళ, వాతావరణ పరిస్థితులు, నిర్మాణ ధోరణుల ప్రభావం ఈ మసీదు రూపకల్పనలో కనిపిస్తుంది. కాలక్రమేణా ఇందులో కొన్ని మార్పులు చేసినప్పటికీ, ఆ ప్రాచీనత గాలి ఇంతవరకూ అలాగే నిలిచి ఉంది. నేటికీ ఈ మసీదులో నమాజ్ కొనసాగుతూనే ఉంది.
కేరళలో ఇస్లాం వచ్చినంత పురాతన చరిత్ర క్రైస్తవ మతానికీ ఉంది. భారతదేశంలో నిర్మించబడిన తొలి చర్చి కూడా కేరళలోనే ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ చర్చిని క్రీ.శ.52 సంవత్సరంలో త్రిస్సూర్ జిల్లాలోని పాలయూర్ ప్రాంతంలో నిర్మించినట్లు చెబుతారు. యేసు క్రీస్తు శిష్యుల్లో ఒకరైన సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చినట్టు ప్రాచీన గ్రంథాలు పేర్కొంటాయి. ఆయనే స్వయంగా ఈ చర్చిని నిర్మించినట్లు నమ్మకం ఉంది. అందుకే దీనికి సెయింట్ థామస్ చర్చి అనే పేరు ప్రసిద్ధి చెందింది. పెరియార్ నది ఒడ్డున ఉన్న ఈ చర్చి క్రైస్తవులకు పవిత్ర తీర్థంగా భావించబడుతుంది. ఆధ్యాత్మికత, చరిత్ర కలసిన ఈ ప్రదేశం శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది.
క్రైస్తవ మతం కేరళలో స్థిరపడిన తర్వాత కొడుంగల్లూరు, పరవూర్, పాలయూర్, కొక్కమంగళం, నిరణం, నీలక్కల్, కొల్లాం, కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో కూడా అనేక చర్చిలు నిర్మించబడ్డాయి. ఇవి కేవలం ఆధ్యాత్మిక స్థలాలే కాకుండా చరిత్రకు సాక్ష్యాలు కూడా. ఆ కాలపు సంస్కృతి, నిర్మాణ శైలి, విదేశీ మతాల ప్రవేశాన్ని ఇవి స్పష్టంగా చెప్పగలవు.
ఇక యూదు మత చరిత్ర కూడా కేరళలోనే అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. కొచ్చిలోని పరదేశి సినాగో దేశంలో తొలి యూదు ప్రార్థనా మందిరంగా నిలిచింది. దీన్ని 1567 సంవత్సరంలో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు వ్యాపారులు, వలసదారులు ఇక్కడకు వచ్చి శతాబ్దాల పాటు ప్రార్థనలు చేశారు. ఒకప్పుడు కొచ్చిలో మొత్తం ఏడు యూదు ప్రార్థనా మందిరాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే కాలక్రమేణా జనాభా తగ్గిపోవడంతో ప్రస్తుతం ఒక్కచోటే ప్రార్థనలు కొనసాగుతున్నాయి.
పరదేశి సినాగో నిర్మాణ శైలి, పురాతన దృశ్యం, నీలిరంగు చైనా టైల్స్, పాత గ్రంథాలు చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. కానీ 1700 చివర్లో మైసూర్ సైన్యం జరిపిన దాడిలో ఈ ప్రార్థనా మందిరానికి కొంత నష్టం వాటిల్లిందని చెబుతారు. అయినప్పటికీ ఇది భారతదేశంలోని యూదు చరిత్రను తెలిపే ఏకైక పవిత్ర స్థలంగా నిలిచింది.
ఇలా చూసుకుంటే కేరళ భారతదేశంలో మత వైవిధ్యానికి మొదటి కేంద్రమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇస్లాం, క్రైస్తవం, యూదు మతాల తొలి ప్రార్థనా స్థలాలు ఒక్క రాష్ట్రంలో ఉండటం భారతదేశం శతాబ్దాలుగా ఎంత శాంతియుతంగా, ఎంత ఆహ్వానంగా మతాలను స్వీకరించిందో తెలియజేస్తుంది. కేరళ భూమి కేవలం దేవాలయాల భూమి మాత్రమే కాదు, మతాల సంగమభూమి.
ALSO READ: DONT MISS: ఈ ఏడాది ఇదే చివరిది..





