
Hindu Spiritual Beliefs: హరిహరసుతుడైన అయ్యప్పస్వామి ఆలయం ఇదు శాస్త్రాలయాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. అరణ్యాల నడుమ, శబరిమలైకి ఎదురుగా ఉన్న పొన్నంబల మేడలో అయ్యప్ప స్వామి జీవన్ముక్తుడిగా కొలువై ఉన్నాడనే విశ్వాసం భక్తుల్లో గాఢంగా ఉంది. శబరిమలై అనే పేరు శబరి యొక్క పర్వతం అనే అర్థాన్ని కలిగి ఉండటం విశేషం. కొండల మధ్య నిత్య బ్రహ్మచారిగా వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే భక్తులు తప్పనిసరిగా మాలాధారణ చేసి దీక్ష చేపట్టాల్సిందే. అయ్యప్ప మాల తీసుకున్న భక్తులు 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో జీవితం సాగించాలి. ఆహార నియమాలు, శుద్ధాచారం, బ్రహ్మచర్య వ్రతం, నిత్యనామస్మరణ వంటి ఆచారాలను పాటిస్తూ చివరకు ఇరుముడి కట్టుకుని సన్నిధానం చేరి స్వామివారి దర్శనం చేసుకోవడంతో దీక్ష పరిపూర్ణమవుతుంది.
అయ్యప్ప దీక్షలో 108 తులసి, రుద్రాక్ష, ఎర్రచందనం, స్పటిక వంటి మాలతో మాల ధరించడం ఆనవాయితీ. ఈ మాలల్లో ఒకటి ఉపమాలగా ఉండవచ్చు లేదా రెండు మాలలు ధరించి వాటి మధ్యలో స్వామి అయ్యప్ప లాకెట్‌ను భక్తులు అలంకరించుకుంటారు. దీక్ష అనేది కేవలం ఆచారం మాత్రమే కాకుండా ఆత్మ నియంత్రణకు, మనోశుద్ధికి, భక్తి పరిపక్వతకు మార్గమని భక్తులు విశ్వసిస్తారు.
అయ్యప్ప దీక్షను తొలిసారి స్వీకరించిన భక్తులను కన్నెస్వాములు అని పిలుస్తారు. ఈ కన్నెస్వాములంటే అయ్యప్ప స్వామికి అపారమైన ప్రీతి ఉందని పురాణాలు చెబుతాయి. అందుకే అయ్యప్ప దీక్ష చేపట్టే ప్రతి భక్తుడు తన సన్నిధానంలో కనీసం ఒక్క కన్నెస్వామి ఉండాలని ఆకాంక్షిస్తాడు. కన్నెస్వాములకు స్వామి ఎందుకంత ప్రీతిపాత్రుడు, వారిని ఎందుకు శక్తివంతులుగా భావిస్తారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే అయ్యప్ప అవతార రహస్యాన్ని అవగాహన చేసుకోవాల్సిందే.
దత్తాత్రేయుడి భార్య లీలావతి పతి శాపం కారణంగా మహిషాసురుడి సోదరి మహిషిగా జన్మించింది. లోకాన్ని హింసిస్తున్న మహిషాసురుని లోకమాత సంహరించిన తరువాత, శాపబంధంతో ఉన్న లీలావతి మహిషిగా మారి రాక్షసులకు రాజుగా సింహాసనం అధిష్ఠించింది. దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మహిషి ఘోర తపస్సు చేసి అపార శక్తులను సంపాదించి ప్రజలను తీవ్రంగా హింసించసాగింది. దేవతల ప్రార్థన మేరకు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు అయ్యప్పగా అవతరించి మహిషిని సంహరించాడు.
మహిషికి శాప విమోచనం లభించడంతో ఆమె అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవాలని కోరింది. కానీ నిత్య బ్రహ్మచారిగా ఉన్న స్వామి ఆమె కోరికను తిరస్కరించాడు. అయినప్పటికీ ఆమె పట్టుదల వీడకపోవడంతో, తన దర్శనానికి కన్నెస్వాములు రాని రోజున నిన్ను వివాహం చేసుకుంటానని అయ్యప్ప స్వామి వరం ఇచ్చాడు. కన్నెస్వాముల రాకకు గుర్తుగా శరంగుత్తిలో బాణాలను ఉంచుతారని, ఎప్పుడైతే అక్కడ ఒక్క బాణం కూడా కనిపించదో ఆ రోజునే వివాహం జరుగుతుందని స్వామి చెప్పాడు. అంతేకాదు శబరి కొండల్లో నీవు మాలికాపురత్తమ్మగా పూజలందుకుంటావని కూడా తెలిపారు.
కన్నెస్వాములు రాక ఆగడం ఎప్పటికీ జరగదనే దానిలోనే ఈ కథ యొక్క పరమార్థం దాగి ఉంది. ఎందుకంటే అయ్యప్ప అవతారం బ్రహ్మచార్య తత్త్వానికి ప్రతీక. అందుకే ప్రతి సంవత్సరం శబరిగిరికి వచ్చే కన్నెస్వాములు ఎరుమేలి నుంచి తెచ్చిన బాణాలను శరంగుత్తిలో గుచ్చుతారు. మాలికాపురత్తమ్మ ఏటా ఈ ప్రదేశానికి వచ్చి బాణాలను చూసి నిరాశతో వెనుదిరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇది భక్తి, త్యాగం, నియమ నిష్టలతో కూడిన అయ్యప్ప తత్త్వాన్ని మరింత లోతుగా తెలియజేస్తుంది.
అయ్యప్ప దీక్షలో తొలిసారి మాల ధరించినవారిని కన్నెస్వాములు అని పిలిస్తే, రెండోసారి దీక్ష చేసే వారిని కత్తిస్వాములు, మూడోసారి గంటస్వాములు, నాలుగోసారి గధాస్వాములు, ఐదోసారి తెరుస్వాములు, ఆరోసారి గురుస్వాములు అని పిలవడం ఆనవాయితీ. ఈ విధంగా ప్రతి దశలో భక్తుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ స్వామి తత్త్వానికి మరింత దగ్గర అవుతాడనే నమ్మకం భక్తుల్లో ఉంది.
ALSO READ: వందేమాతరం ఆలపించిన ఇథియోపియా సింగర్లు.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ





