
-
బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా
-
రేపు మధ్యాహ్నం 2.15కి విచారించనున్న హైకోర్టు
-
రేపు మరిన్ని వాదనలు వింటామన్న ఏజీ
-
పిటిషనర్ల తరపు వాదనలు విననున్న ధర్మాసనం
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో బీసీలో రిజర్వేషన్ల పెంపు విషయంపై హైకోర్టులో బుధవారం కీలక విచారణ జరిగింది. బీసీ రిజర్వేషన్ల కేటాయింపు సరిగా జరగలేదని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ధర్మాసనం విచారణను చేపట్టింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, పిటిషనర్ల తరపున సుదర్శన్ తమ వాదనలు విన్పించారు.
బీసీ రిజర్వేషన్ల పెంపును తెలంగాణలోని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని అభిషేక్‌సింఘ్వీ కోర్టుకు తెలిపారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైందని, ఈ సమయంలో రిజర్వేషన్ల జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరడం సరైందని కాదని సింఘ్వీ వాదించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లను పెంచే హక్కు ప్రభుత్వాలకు ఉందని సింఘ్వీ తెలిపారు. ఏకసభ్య కమిషన్ ఆధారంగా బీసీ రిజర్వేషన్లు 42శాతం వరకు ఆమోదించబడ్డాయని వెల్లడించారు. ప్రస్తుతం ఈ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందని సింఘ్వీ గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. గవర్నర్ వద్ద బిల్లు ఎన్నాళ్లుగా పెండింగ్‌లో ఉందో చెప్పాలని సూచించింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఎలా నిర్వహించారో తెలపాలంది. కమిషన్ రిపోర్టును బహిర్గతం చేశారో లేదో చెప్పాలంది. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని హైకోర్టు కోరింది.
ఈ కేసులో పిటిషనర్ల తరపు నుంచి ఫైనల్ హియరింగ్‌ను రేపు మధ్యాహ్నం వింటామని అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 2.15కి విచారణను వాయిదా వేసింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను రేపు ఈసీ విడుదల చేయనున్న నేపథ్యంలో… ఈ ప్రక్రియను నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. అయితే పిటిషనర్ల వాదనలను హైకోర్టు పట్టించుకోలేదు.