High Court Warning: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట వివాదానికి సంబంధించి డిసెంబర్ 5వ లోపు కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఏవీ రంగనాథ్‌ను ఆదేశించింది. లేదంటే, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. బతుకమ్మకుంట వ్యవహారంలో హైకోర్టుకు ఏవీ రంగనాథ్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
బతుకమ్మకుంటలోని ప్రైవేట్ స్థలంపై కొద్ది నెలల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రైవేట్ స్థలంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దంటూ ఈ ఏడాది జూన్12వ తేదీన కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించారంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ప్రైవేట్ స్థలంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆయనకు సూచించింది. అంతేకాకుండా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటూ రంగనాథ్‌ను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. కానీ కోర్టుకు హైడ్రా కమిషనర్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
తొలి నుంచి హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం
వాస్తవానికి హైడ్రా తీరుపై హైకోర్టు తొలి నుంచి ఆగ్రహంగానే ఉంది. హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఆక్రమణల పేరుతో పేదళ ఇళ్లు కూలగొట్టడాన్ని తప్పుబడుతుంది. ఇప్పటికే పలుమార్లు హైడ్రాను మందలించింది. ఇప్పుడు ఏకంగా హైడ్రా కమిషనర్ విచారణకు రాకపోతే ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.





