
High Court: భారత సమాజంలో వివాహ బంధానికి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలతో ముడిపడిన ఈ బంధాన్ని సమాజం ఎంతో గౌరవంగా చూస్తుంది. అయితే కాలక్రమేణా జీవన శైలిలో మార్పులు వచ్చాయి. వివాహేతర సంబంధాలు, సహజీవనం వంటి అంశాలు సమాజంలో చర్చనీయాంశాలుగా మారాయి. ఇటీవల వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు సమాజాన్ని కలచివేస్తున్న తరుణంలో, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
లివింగ్ రిలేషన్ షిప్ అనేది చట్టవిరుద్ధం కాదని, అలాంటి సంబంధాల్లో ఉన్న మహిళల ప్రశాంత జీవనానికి భంగం కలిగించరాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. సహజీవనం చేస్తున్న జంటలకు రక్షణ కల్పించాల్సిందేనని పోలీసులను ఆదేశిస్తూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఇది ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చని పేర్కొన్నప్పటికీ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణే న్యాయస్థాన లక్ష్యమని కోర్టు అభిప్రాయపడింది.
సహజీవనం చేస్తున్న 12 జంటలు తమ ప్రాణాలకు, స్వేచ్ఛకు ముప్పు ఉందంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ సింగిల్ బెంచ్.. లివింగ్ రిలేషన్ షిప్‌ను నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. వివాహ సర్టిఫికెట్ లేకపోయినంత మాత్రాన ఇద్దరు కలిసి జీవించడం నేరం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్న మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని సంబంధిత జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది.
మహిళల ప్రశాంత జీవనానికి ఎవరైనా భంగం కలిగిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు సమాజంలోని సంప్రదాయ భావజాలానికి భిన్నంగా అనిపించవచ్చని కోర్టు పేర్కొన్నా.. వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కును అత్యున్నతంగా పరిగణించాల్సిందేనని అభిప్రాయపడింది. మైనర్ లేదా మేజర్, వివాహిత లేదా అవివాహిత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ తన ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ప్రకారం.. పిటిషనర్లు వివాహం చేసుకోలేదన్న వాస్తవం వారి జీవించే హక్కును హరించదని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. విద్యావంతులైన మహిళలు తమ ఇష్టానుసారంగా జీవించాలని నిర్ణయించుకుంటే వారికి పోలీసులు రక్షణ కల్పించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నాలను సహించబోమని స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది.
ALSO READ: మహిళలకు నెలకు రూ.2,500.. ఎప్పుడంటే?





