
రాజన్న సిరిసిల్ల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కళ్లముందే ఆడుకుంటూ తిరిగిన ఆరేళ్ల చిన్నారి ఒక్కసారిగా మృత్యువాత పడటం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. పట్టణంలోని సర్దార్ నగర్ కాలనీలో నివసిస్తున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తూ సెప్టిక్ ట్యాంక్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. "లే నాన్న.. అన్నం తినిపిస్తా
రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దార్ నగర్లో విషాదం నెలకొంది. బుధవారం రాత్రి ఆడుకుంటూ వెళ్లిన నికేష్(6) అనే బాలుడు, నిర్మాణంలో ఉన్న సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే తిరుగుతూ సందడి చేసిన చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ… pic.twitter.com/NCpzkf4leN
— ChotaNews App (@ChotaNewsApp) December 25, 2025
వివరాల్లోకి వెళ్తే.. బాలుడు తన ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సెప్టిక్ ట్యాంక్‌కు సరైన మూత లేకపోవడంతో అనుకోకుండా అందులోకి జారి పడినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికి బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకగా, సెప్టిక్ ట్యాంక్‌లో విగతజీవిగా కనిపించాడు.
వెంటనే బాలుడిని బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతూ రోదనలు చేశారు. కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి అకాల మరణం అందరినీ కలచివేసింది.
ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. చిన్నపిల్లలు ఉన్న ఇళ్ల వద్ద సెప్టిక్ ట్యాంకులు, నీటి సంపులు వంటి వాటికి తప్పనిసరిగా బలమైన మూతలు ఏర్పాటు చేయాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.





