
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, లాలాపేట్, నాచారం, మల్లాపూర్, తార్నాకలో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ సూచించింది. వర్షం పడటంతో ప్రజలు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు.
తెలంగాణలో ద్రోణి ప్రభావంతో 5 రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు ఉత్తర ప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ మీదుగా దక్షిణ ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు తూర్పు బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించి ఉంది. ఇదే ద్రోణి బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్, విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమలో విస్తరించి ఉంది. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా కేరళ వరకు ఉన్న ఈ ద్రోణి బలహీనపడింది. ఫలితంగా రానున్న 3-4 రోజుల్లో నైరుతి రుతు పవనాలు మరింతగా పురోగమించనున్నాయి. దాంతో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో త్వరగా ప్రవేశించనున్నాయి.
వాతావరణంలో సంభవించిన ఈ మార్పుల కారణంగా 5 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు తక్కువే నమోదు కావచ్చు. కొన్ని జిల్లాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. వడగండ్లతో వర్షాలు పడనున్నాయి. ఇక రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలులు గట్టిగా ఉంటాయి.