
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేని వాన పడుతోంది. రాయలసీమ లోనూ అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. అల్పపీడన ప్రభావం రెండు రోజులు ఉండనున్న నేపథ్యంలో అప్పటి వరకు వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
అటు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పగటివేళ సముద్రంలో, రాత్రివేళ తీరంపైకి వస్తోంది. విశాఖకు కొద్ది దూరంలో ఒడిశాకు పక్కనే సముద్రంలో తిరుగుతోంది. ఈ అల్పపీడనం ఇవాళ సాయంత్రం వేళ భువనేశ్వర్ – పద్మపూర్ మధ్యలో తీరం దాటుతుంది. ఈ కారణంగా ఏపీలో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. 27, 28 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే మరో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడే సమయంలో ప్రజలను బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు.