
Telangana Rains: తెలంగాణలో మరోమూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు.. ఇంకొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది.
ఇవాళ వర్షాలు కురిసే జిల్లాలు
ఇవాళ ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం రికార్డయ్యే సూచనలున్నాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కొత్తగూడెంలో అత్యధిక వర్షపాతం
గడిచి 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, మెదక్, ములుగు, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా కొత్తగూడెం జిల్లా సీతారామపట్నం గ్రామంలో 9.3 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డు అయ్యింది.