
Rains In Telangana, AP: తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. ఈ ప్రభావంతో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవన ద్రోణి రాజస్థాన్ పరిసర ప్రాంతాలతో పాటు ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నట్టు వెల్లడించింది. ఈ ఎఫెక్ట్ తో ఈ నెల 22 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు ప్రకటించింది. ఇక బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసినట్టు తెలిపింది. ఇవాళ (గురువారం) ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. అత్యధికంగా మెదక్ జిల్లా చేగుంటలో 2.85 సెం.మీ వర్షం పడినట్లు తెలిపింది.
ఏపీలో విస్తారంగా వర్షాలు
అటు ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు పడుతాయని తెలిపింది. బ్రేక్ మాన్ సూన్ లాంటి పరిస్థితులతో మూడు రోజుల పాటు కోస్తా ఆంధ్రా, తూర్పు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, కృష్ణ, ఉభయ గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వరుసగా మూడు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందన్నారు. వర్షాలు ఎక్కువగా రాత్రి పూట కురవనున్నట్లు వెల్లడించారు.
Read Also: 6 రోజులు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?