
Rains In Andhra Pradesh: రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడుతాయని వెల్లడించింది. ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ తీర ప్రాంతా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం సహా పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయన్నారు. వానలు పడే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
లంక గ్రామాలకు రాకపోకలు బంద్
అటు వరద ప్రవాహంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా బూరుగులంక దగ్గర గోదావరి నదీ పాయ మీద టెంపరరీగా ఏర్పాటు చేసిన రోడ్డు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో గోదావరి తీర ప్రాంతంలోని బూరుగులంక, ఉడిమూడిలంక, అరిగెల వారిపేట, పెదపూడి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. అయినా వ్యక్తిగత పనుల కోసం ఆయా గ్రామాల ప్రజలు పడవలపై ప్రమాదకర రీతిలో రాకపోకలు సాగిస్తున్నారు.
పోలవరానికి పెరిగిన వరద
అటు ఏలూరు జిల్లా పోలవరం దగ్గర కుడి, ఎడమ గట్లను తాకుతూ గోదావరి నది ప్రవహిస్తున్నది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరికి భారీగా పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే దగ్గర నీటి మట్టం 28.40 మీటర్లకు పెరిగింది. 48 గేట్ల ద్వారా గోదావరిలోకి 2.35 లక్షల క్యూసెక్కులు వెళుతోందని అధికారులు తెలిపారు.
Read Also: శ్రీశైలానికి భారీ వరదల, సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు!