హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలుగు రాష్ర్టాల్లో ఒక వైపు ఎండలు, ఉక్కపోతు, మరోవైపు ఆకస్మత్తుగా మబ్బులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు మూడు రోజులు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో…
ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, దానికి అనుబంధంగా ద్రోణి కూడా విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసరాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తెలంగాణలో…
తెలంగాణలో కూడా మబ్బులతో కూడిన వాతావరణం నెలకొని ఉంది. దీంతో వర్షాలు కురిసే ప్రభావం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షపాతం నమోదవగా, రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి.
తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్…
కొమురంభీం ఆసిఫాబాద్,ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి వరకు పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు ప్రభావం చూపవచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
