
Kamareddy Rains: కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాల ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కురుస్తున్న అతి భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుపోటెత్తడంతో చాలా కాలనీలు జలమయమై జనాలు బిక్కుబిక్కుమంటూ ఇండ్లలోనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వరదల దాటికి కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. వరద ఉధృతితో జాతీయ రహదారిని 44 తాత్కాలికంగా మూసివేశారు. అటు నిజామాబాద్- హైదరాబాద్ మార్గంలో కామరెడ్డి జిల్లా బిక్కనూరు వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్న కారణంతో పలు రైళ్ల రాకపోకలను సౌత్ సెంట్రల్ రైల్వే నిలిపివేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
జలదిగ్భందంలో కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద గంట గంటకు పెరుగుతోంది. భారీ వర్షం తగ్గు ముఖం పట్టకపోవడంతో వరద ప్రవాహం తీవ్రతరం అవుతుంది. కామారెడ్డి పట్టణ శివారు కాలనీలు జలవలయంలో చిక్కుకున్నాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీ, జిఆర్ కాలనీ ప్రాంతాల్లో వరద ప్రవాహం నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది. భవనాలు మునిగిపోవడంతో అందులో నివాసితులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసుకుంటూ వీడియోలు తీసి పంపుతున్నారు.
సాయం కోసం బాధితుల ఎదురు చూపు!
కొన్ని భవనాల్లో మొదటి ఫ్లోర్ అంతా మునిగి రెండో ఫ్లోర్ ను వరద తాకుతోంది. రెండో ఫ్లోర్ లోకి సైతం వరద వస్తున్న నేపథ్యంలో బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని రెస్క్యూ టీమ్ లను పంపించాలని కోరుతున్నారు. కామారెడ్డిలో చాలా కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అవస్థలు పడుతున్నారు.
పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
అతి భారీ వర్షాలతో అల్లాడుతున్న కామారెడ్డి జిల్లాలో ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు.