
Heavy Rains: ఉత్తరాదిన భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ కుండపోత వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. ఇప్పటి వరకు 30 మంది చనిపోగా, 23 మంది గాయపడ్డారు. పూంచ్, రాజౌరి జిల్లాలు మినహా మొత్తం జమ్మూ డివిజన్‌లో ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. తావి నది శాంతించినా, చీనాబ్ నది ప్రమాద స్థాయికి దగ్గరగా ప్రవహిస్తుంది. విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ సేవలను పూర్తిగా దెబ్బతినడంతో వాటిని అధికారులు పునరుద్ధరిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. SDRF, NDRF, పారామిలిటరీ, ఆర్మీ, వైమానిక దళ అధికారులు, పౌర పరిపాలనతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటూ.. సహాయక చర్యలు చేపడుతున్నారు. జమ్మూకాశ్మీర్ లో సహాయక చర్యలను కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఒమర్ అబ్దుల్లా ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితి, చేపడుతున్న సహాయక చర్యల గురించి వివరించారు.
హిమాచల్ ప్రదేశ్ లోనూ వరదల బీభత్సం
ఇక హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బియాస్ నదితో సహా అనేక వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మనాలిలోని రైసన్ టోల్ ప్లాజాను బియాస్ నదీ ప్రవాహం ముంచెత్తింది. ఆ రహదారి అంతా వరద నీటి మయంగా మారింది. నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆకస్మిక వరదలకు పలు భవనాలు కూలిపోయాయి. షాపులు, ఇళ్లు కొట్టుకుపోయాయి. రహదారులు తెగిపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం నుంచి బుధవారం వరకు 12 సార్లు ఆకస్మిక వరదలు సంభవించాయి. లాహౌల్, స్పితి జిల్లాలో తొమ్మిది, కులులో రెండు, కాంగ్రాలో ఒకసారి ఆకస్మికంగా వరదలు వచ్చాయి. చంబాలో కుంభవృష్టి నమోదైంది. రెండు పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. కాంగ్రాలో ఒకరు మునిగిపోగా, కిన్నౌర్‌లోని ఎత్తు నుంచి పడి ఒకరు మరణించారు. హిమాచల్ సర్కారు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది.