తెలంగాణ

మూడు రోజులు భారీ వర్షాలు, మళ్లీ సాగర్ గేట్లు ఓపెన్!

Heavy Rains:  రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 13 నుంచి 15 వరకు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్‌ అలెర్ట్‌ కూడా జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇక ఆది, సోమ, మంగళవారాల్లోనూ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

ఇక శనివారం నాడు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురిశాయి. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్‌మెట్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, తార్నాక, అబిడ్స్‌, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. ఈ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వగా.. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి 11 గంటల సమయానికి అబ్దుల్లాపూర్‌ మెట్‌ లో అత్యధికంగా 13..5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. నాంపల్లి లో 12..4 సెం.మీ వర్షం కురిసింది. భారీ వర్షానికి యూసు్‌ఫగూడ కృష్ణానగర్‌ ప్రాంతంలో వరద పోటెత్తెంది.  దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.అటు సంగారెడ్డి, సిద్దిపేట, నారాయణపేట, గద్వాల, వనపర్తి, వికారాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని వాగులు పొంగి పొర్లగా పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తి, వరి పంటలు వరద ముంపునకు గురయ్యాయి.

ఇవాళ నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్

ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నేపథ్యంలో ఇవాళ  నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు గేట్లను ఓపెన్ చేశారు.  రెండు క్రస్ట్‌ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు. సాగర్‌ నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది.

Read Also: హిమాయత్ సాగర్ 5 గేట్లు ఓపెన్.. హైదరాబాద్ కు గండం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button