
Heavy Rainfall Alert for Telangana: రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. ఇప్పటికే వర్షాలకు పలు జిల్లాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. రాకపోకలు బంద్ అయ్యాయి. పెద్ద మొత్తంలో పంట నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు చేసింది.
మరో 2 రోజులు అత్యంత భారీ వర్షాలు
మరో మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలుంటాయని తెలిపింది.ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.
రేపు ఏ జిల్లాల్లో వానలు పడుతాయంటే?
అటు బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.