
Heavy Rains In Telangana: తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. ఇవాళ (సోమవారం) అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయన్నారు. ముఖ్యంగా నార్త్ తెలంగాణ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు
అటు మంగళవారం నాడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలెర్ట్ ఇచ్చారు.
ఈ నెల 12 వరకు ఓ మోస్తారు వర్షాలు
ఈ నెల 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు వర్షం కురిసే సమయంలో ఉరుములు, పిడుగులు పడతాయని వెల్లడించారు. వీలైనంత వరకు వర్షం కురిసే సమయంలో బయటకు రాకపోవడం మంచిదన్నారు. రైతులు బావుల దగ్గర చెట్ల కింద ఉండకూడదని సూచించారు.
Read Also: శ్రీశైలానికి పోటెత్తిన వరద, సాగర్ లోకి ఇన్ ఫ్లో ఎంతంటే?