
Heavy Rains In AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని.. రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ ఏపీలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.
ఇవాళ ఏ జిల్లాల్లో వానలు కుస్తాయంటే?
అల్పపీడనం ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ చెప్పుకొచ్చారు. పార్వతీపురం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం సాయంత్రం వరకు మన్యం జిల్లా సీతంపేటలో 77 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా మలికిపురంలో 74.5 మిల్లీమీటర్లు, భీమవరంలో 67.5 మిల్లీమీటర్లు, విజయవాడ పశ్చిమలో 62.5 మిల్లీమీటర్లు, విజయవాడ సెంట్రల్‌లో 62 మిల్లీమీటర్ల చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు.