
Heavy Rains- Flash Floods: దాయాది దేశం పాకిస్తాన్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జూన్ 26 నుంచి దేశ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకు 116 మంది చనిపోయినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 253 మంది గాయపడినట్లు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. గత 24 గంటల్లో వరదల కారణంగా ఐదుగురు చనిపోగా, 41 మంది గాయపడినట్లు తెలిపింది. ఈ వరదల కారణంగా తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లో అత్యధికంగా 44 మంది చనిపోయినట్లు వెల్లడించింది. ఆ తర్వాత వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో 37, దక్షిణ సింధ్ ప్రావిన్స్ లో 18, నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్ లో 16 మంది చనిపోయినట్లు తెలిపింది. ఇవాళ్టి(గురువారం) నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అంతేకాదు, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ ప్రకటించారు.
అమెరికాలో వరదలు బీభత్సం
అటు అగ్రరాజ్యం అమెరికాలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడ చూసిన జల విలయం కనిపిస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఆకస్మిక వరదలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఊహించని వరదలు పోటెత్తి, కార్లు, ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వరదల కారణంగా ప్రాణనష్టం, భారీగా ఆస్తి నష్టం సంభవిస్తోంది. భారీ వర్షాల కారణంగా న్యూజెర్సీలో గవర్నర్ ఫిల్ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తాజాగా వరదల్లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఎప్పటి వరకు అంటే..