
Heavy Rain In Telangana And AP: రుతుపవనాలకు తోడు, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఈ జిల్లాల్లో ఏకంగా 20 సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. అటు నిర్మల్, నిజామాబాద్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్
ఇక బుధవారం నాడు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా, ఇవాళ (జులై 24) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈదురు గాలుల కారణంగా భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులకు కీలక సూచన చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం
అటు ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనున్నది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తూర్పు, మధ్య, ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని స్కైమెట్ వెల్లడించింది. అటు తూర్పు అరేబియా సముద్రం నుంచి మధ్య భారతం, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తాలో పలుచోట్ల వర్షాలు, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. గురువారం కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీగా, దక్షిణ కోస్తాలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా ఈనెల 25,26 తేదీల్లో ఉత్తరకోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బలమైన గాలుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించింది.
Read Also: సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల, రైతుల సంతోషం!