తెలంగాణ

వరుణుడి కల్లోలం.. అన్నదాతల అరిగోస!

Crop Damage: భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని అన్నదాతకు అపారనష్టాన్ని మిగిల్చింది. ఎక్కడికక్కడ వరదనీటిలో పంటలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వరి, పత్తి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాల్లోని పంటలకు నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వేలాది మంది రైతులకు తీరని నష్టం మిగిలింది. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి, నిర్మల్‌, మెదక్‌, సిద్దిపేట, సిరిసిల్ల, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. మిగతా జిల్లాల్లోనూ పంటలకు నష్టం తప్పలేదు. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. కొన్ని చోట్ల కట్టలు తెగిపోవడంతో ఆ నీళ్లన్నీ పంట పొలాల గుండా భారీ వరదలు ప్రవహించడంతో పొలాల్లో ఇసుక మేటలు వేసింది. పొలాల్లోనే నీళ్లు నిలవడంతో పంటలు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డి, నిర్మల్‌, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో పంటలు నామారూపాల్లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా పంటపొలాల్లో నీళ్లు, ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి.

వరి, పత్తి పంటలపై తీవ్ర ప్రభావం

ఈ వర్షాలు పత్తి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనున్నది. భారీ వరదలకు చాలాచోట్ల పంట కొట్టుకుపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పూతకొచ్చిన పత్తి పాడైపోతున్నది. మిగిలిన పంట చేలల్లో రోజుల తరబడి వర్షపు నీరు నిలిచి, పత్తి ఎర్రబారి దిగుబడి తగ్గుతుంది. వర్షాలు మరికొన్నిరోజులు వస్తే పంటపై గులాబీ పురుగు సోకే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ అధికారులు  చెప్తున్నారు. ఓవైపు వర్షాలు, మరోవైపు గులాబీ పురుగుతో పత్తి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు.  నిర్మల్‌ జిల్లాలోని నిర్మల్‌ మండలం ముజ్గి, తాంశ, చిట్యాల్‌ మంజులాపూర్‌ శివారులో దాదాపు 100 ఎకరాల వరకు వరిపంట నీట మునిగింది.  ములుగు, జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాల్లో పలుచోట్ల రోడ్లు ధ్వంసమై వరదనీటితో వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి.  ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 15,686 ఎకరాల్లో పంటల నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. సంగారెడ్డి జిల్లాలో 2,000 ఎకరాలు, మెదక్‌ జిల్లాలో 6,341 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 7,345 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ పంటపొలాలు మట్టిదిబ్బలుగా మారాయి. వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button