
Heavy Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్‌ఆర్‌నగర్, ఎర్రగడ్డ, మూసాపేట్ లో భారీ వర్షం పడుతుంది. కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్‌లో మోస్తారు వర్షం కురుస్తుంది. వర్షాలతో ప్రయాణీకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో స్టేషన్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో సహాయక బృందాలు అప్రమత్తమయ్యాయి.
జిల్లాల్లోనూ భారీ వర్షాలు
హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోవర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
ఈ నెల 16 వరకు భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఈ నెల 13 నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవనున్నట్లు వివరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు వర్షం పడుతున్నప్పుడు బయటకు రాకూడదని అధికారులు సూచించారు.
Read Also: కోస్తాలో భారీ వర్షాలు.. ఎన్ని రోజులు అంటే?