
-
లంచం డిమాండ్‌తో మానసికంగా కుంగి లోకేష్ చందర్ ఆత్మహత్య
-
నిందితులపై చర్యలు కోరుతూ తల్లి ఆందోళన
క్రైమ్ మిర్రర్, జోగిపేట (సంగారెడ్డి జిల్లా) : జోగిపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట హృదయ విదారక దృశ్యం చోటు చేసుకుంది. తన కుమారుడి మృతదేహంతో తల్లి ఆందోళనకు దిగింది. గత నెల 30న శివంపేట బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న లోకేష్ చందర్ మృతదేహం 18 రోజుల అనంతరం వెండికోల్ గ్రామ శివారులో లభించింది. మృతుడు లోకేష్ భార్య తెలిపిన వివరాల ప్రకారం – సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ ఒక కేసు విషయంలో లంచం ఇవ్వాలని ఒత్తిడి చేశారని, ఆ ఒత్తిడిని తట్టుకోలేక తన భర్త లోకేష్ ప్రాణాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే జిల్లా ఎస్పీ చర్య తీసుకుని ఎస్సై రవీందర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. అయితే, ఈ ఘటన వెనుక మరికొంతమంది ప్రమేయం ఉందని లోకేష్ తల్లి చెబుతున్నారు. తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. కుమారుడి మృతదేహాన్ని ముందు ఉంచుకుని తల్లి రోదనతో ఆ ప్రదేశం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకొని తల్లి, కుటుంబ సభ్యులను నచ్చజెప్పారు. కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి