
Health Tips: చలికాలం రాగానే మార్కెట్లో విస్తారంగా కనిపించే సింగాడా దుంపలు బయటకు బొగ్గుల్లా నల్లగా కనిపించినా, లోపల మాత్రం పాల తెలుపుతో మెరిసిపోతాయి. గ్రామాల్లో, పట్టణాల్లో సమానంగా ఉపయోగించే ఈ దుంపలు శారీరక ఆరోగ్యానికి సహజ ఔషధాల్లా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, చర్మం- జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడానికి సింగాడాలు సహజసిద్ధమైన సంపూర్ణ ఆహారంగా భావిస్తారు.
సింగాడాకు తీపి, స్వల్ప వగరు కలిసి ఉండే ప్రత్యేక రుచి ఉంటుంది. క్రంచీగా నమిలే గుణం ఉండడం వల్ల చిన్నవారు, పెద్దవారు అందరూ ఇష్టపడతారు. వీటిని ఉడికించి తిన్నా చక్కగా ఉంటాయి. కాల్చుకుని తిన్నా మరింత రుచిగా ఉంటాయి. సలాడ్లలో కలపవచ్చు, సూపుల్లో వేసుకోవచ్చు, శాండ్‌విచ్‌లలో కూడా అద్భుతమైన ఫ్లేవర్ ఇస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ దుంపలను ఎండబెట్టి పిండి రూపంలో తయారు చేసి రొట్టెలు, లడ్డూలు, కడి రకాల కూరలు అందంగా చేసుకుంటారు. ఉపవాసాలు, పూజలు చేసేప్పుడు సింగాడా పిండిని ఎక్కువగా వాడటం కూడా ఇదే కారణం.
సింగాడాలలో పీచుపదార్థాలు అధికంగా ఉండటం విశేషం. ఇవి పేగుల కదలికలను సవ్యంగా నడిపి చలికాలంలో తరచుగా వచ్చే మలబద్ధకం సమస్యకు సహజ చికిత్సల్లా ఉంటాయి. జీర్ణవ్యవస్థను చురుకుగా చేసి ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి మంచి సహాయకాలు.
ఈ దుంపల్లో కాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్, కాపర్ వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరచి దంతాలను దృఢంగా ఉంచుతాయి. రక్తప్రసరణను నియంత్రించి గుండె ఆరోగ్యంగా పనిచేయడంలో సహాయపడతాయి. మెదడుకు కావలసిన శక్తిని అందించి దాని పనితీరును మెరుగుపరుస్తాయి.
సింగాడాలో ఉండే లారిక్ యాసిడ్ అరుదైనది. ఇది చర్మానికి తేమను అందించి పొడిబారడాన్ని నివారిస్తుంది. శిరోజాల పెరుగుదలను ప్రోత్సహించి జుట్టు మరింత ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది. చర్మ సంబంధిత ఇబ్బందులు, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో పేరుకునే హానికర పదార్థాలను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రంగా ఉంచుతుంది.
సింగాడాలో బీ, సీ, ఇ, కె వంటి విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చలికాలంలో వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తాయి. కేలరీలు, కొవ్వులు చాలా తక్కువగా ఉండటం వల్ల డైట్‌లో వీటిని చేర్చుకునేందుకు ఇది ఉత్తమమైన ఆహారం. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి కూడా ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
ALSO READ: Aadhaar history: దేశంలో తొలి ఆధార్ కార్డు ఎవరిదంటే..?





