తెలంగాణరాజకీయం

నన్ను ఎంతో హింసపెట్టాడు - కేసీఆర్‌ను వదిలే లేదన్న రాములమ్మ

విజయశాంతి.. ఊహించని విధంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అయ్యారు. పదవి రాగానే… స్వరం కూడా పెంచారు. కేసీఆర్‌పై ఉన్న కోపమంతా… ఒక్కసారిగా బయటపెట్టేశారు. తన రాజకీయ రంగ ప్రవేశం నుంచి తల్లి తెలంగాణ పార్టీ విలీనం వరకు అన్ని విషయాలు పంచుకున్నారు. తనను తొక్కేయాలని చూసిన కేసీఆర్‌ను మాత్రం వదిలేది లేదని ఘాటుగా విమర్శించారు విజయశాంతి. అంతేకాదు బీఆర్‌ఎస్‌పై కూడా భగ్గుమన్నారు రాములమ్మ.

తెలంగాణ కేసీఆర్‌ జాగీరు కాదని… రాష్ట్రం కోసం ఎంతో మంది త్యాగాలు, బలిదానాలు చేశారన్నారు విజయశాంతి. కేసీఆర్‌ కంటే ముందు… తెలంగాణ కోసం పోరాడింది తానేనని అన్నారామె. తనను హింసపెట్టి.. వేధించి… తాను పెట్టిన తల్లి తెలంగాణ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయించుకున్నారని ఆరోపించారు విజయశాంతి. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన ఆనందాన్ని పూర్తిగా ఆశ్వాదించకుండానే… తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తనకు ఎమ్మెల్సీ ఇచ్చారని బీఆర్‌ఎస్‌ నేతలు ఊగిపోతున్నారని.. అంత కుట్రబుద్ధి ఎందుకని ప్రశ్నించారామె. కేసీఆర్‌ దొరబుద్ధి చూపిస్తున్నారని మండిపడ్డారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేతిలో పెడితే… అందరి ఆశయాలను దెబ్బతీశారని.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఫైర్‌ అయ్యారు రాములమ్మ. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎందుకయ్యిందో చెప్పాలన్నారు. కేసీఆర్‌ను మాత్రం వదిలిపెట్టకూడదని చెప్పారామె.

బీజేపీపై కూడా విమర్శలు చేశారు విజయశాంతి. తెలంగాణను వ్యతిరేకించే శక్తులను రాష్ట్రంలోకి తీసుకొచ్చే కుట్ర పన్నుతున్నారని చెప్పారు. ఆ పార్టీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని… ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని గుర్తుచేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ స్నేహితులని.. వారి నుంచి తెలంగాణను కాపాడుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు విజయశాంతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button