
సిద్దిపేటలో మరోసారి మానవత్వాన్ని కలిచివేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, 20 ఏళ్లుగా కలిసి జీవించిన జీవిత భాగస్వామినే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా అభం శుభం తెలియని కన్న కూతురినీ మట్టుపెట్టే యత్నానికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ స్ట్రీట్ నంబర్ 7లో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా, కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న అనుమానాలు, హింస ఎంతటి భయానక పరిణామాలకు దారి తీస్తాయో మరోసారి రుజువు చేసింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన దున్నపోతుల ఎల్లయ్య, శ్రీలత దంపతులకు 19 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి హర్షిత అనే కుమార్తె, అజయ్ అనే కుమారుడు ఉన్నారు. కుమార్తె హర్షిత మిట్టపల్లి కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, కుమారుడు అజయ్ కీసరలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కుటుంబ పోషణ కోసం పదేళ్ల క్రితం ఎల్లయ్య సిద్దిపేటకు వచ్చి చిరు వ్యాపారాలు, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శ్రీలత కూడా కూలీ పనులకు వెళ్తూ, వేసవి కాలంలో సోడా బండి నడుపుతూ కుటుంబానికి అండగా నిలిచింది.
సుమారు ఏడాది క్రితం ఈ కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు మకాం మార్చింది. అయితే ఇటీవల సంక్రాంతి పండుగకు ముందు తిరిగి సిద్దిపేటకు వచ్చి ఆదర్శనగర్ కాలనీ స్ట్రీట్ నంబర్ 7లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తోంది. అయితే ఈ కుటుంబంలో కొంతకాలంగా అంతర్గత కలహాలు, అనుమానాలు తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఎల్లయ్య, ఆమెను హత్య చేయాలని ముందుగానే పథకం వేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఇందుకోసం ముందే గడ్డి మందును తెచ్చి ఇంట్లో దాచిపెట్టినట్లు సమాచారం. ఆదివారం రాత్రి భార్యాభర్తలు ఒక గదిలో, పిల్లలు మరో గదిలో నిద్రపోయారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో నిద్రలో ఉన్న శ్రీలతపై ఎల్లయ్య కత్తితో దాడి చేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
అనంతరం పక్క గదిలో నిద్రిస్తున్న పిల్లల వద్దకు వెళ్లిన ఎల్లయ్య, కూతురు హర్షిత మెడపై కత్తితో దాడి చేశాడు. హర్షిత తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడే ఉన్న రోకలి బండతో ఆమె తలపై బలంగా మోదాడు. ఈ శబ్దాలకు నిద్రలేచిన కుమారుడు అజయ్ పరిస్థితిని గమనించి భయంతో ఇంటి బయటకు పరుగులు తీసి కేకలు వేశాడు. వెంటనే బంధువు సురేష్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేశాడు.
సురేష్ సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఎల్లయ్య గడ్డి మందు తాగుతున్నట్లు గుర్తించాడు. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఎల్లయ్య కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన హర్షితను సురేష్ వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అయితే హర్షితకు కూడా తండ్రి గడ్డి మందు తాగించినట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హర్షిత పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇక ఎల్లయ్య పరిస్థితి కూడా సీరియస్‌గా ఉండటంతో అతడిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆదర్శనగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ALSO READ: 2026లో పెళ్లికి మంచి ముహుర్తాలు ఇవే..





