
హయత్‌నగర్ (క్రైమ్ మిర్రర్):- హయత్‌నగర్ సెంటర్లో ఆదివారం పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. స్థానిక కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు.ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. మాలబస్తీ, ముదిరాజ్ కాలనీ, శుభోదయం కాలనీ, ఆర్టీసీ కాలనీ ప్రాంతాల్లో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, డప్పు శబ్దాలతో జాతర ఉత్సాహంగా సాగుతోంది.
ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు ఉత్సవాలు కొనసాగుతాయని కమిటీ పేర్కొంది. సాంప్రదాయ కళలతో హయత్‌నగర్ సెంటర్ సందడిగా మారింది.