
-
పేరుకే హెచ్‌ఎండీఏ లే ఔట్
-
ప్లాన్ బోర్డులో రోడ్ల విస్తీర్ణంపై స్పష్టత కరువు
-
ఆక్రమణకు గురవుతున్న రోడ్లు
-
పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికారులు
-
కాలనీ పెద్దలు చొరవ తీసుకోవాలని స్థానికుల డిమాండ్
-
రోడ్ల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నల వర్షం
(క్రైమ్ మిర్రర్ – స్పెషల్ రిపోర్ట్ ) : జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ గ్రామపంచాయతీ పరిధిలోని హస్తినాపురం, అగ్రికల్చర్ కాలనీ ఇప్పుడు కొత్త వివాదానికి కేంద్ర బిందువైంది. హెచ్ఎండిఏ అప్రూవల్ పొందిన లేఔట్ అయినప్పటికీ, మ్యాప్ ప్లాన్ బోర్డులో రోడ్ల ఫీట్లు (వెడల్పులు) స్పష్టంగా చూపించకపోవడం స్థానికుల్లో తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. కాలనీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన మ్యాప్ బోర్డుపైన రోడ్ల వివరాలు లేకపోవడంతో, కాలనీలో రోడ్లు ఆక్రమణకు గురవుతున్నాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన రహదారి పాక్షికంగా ఆక్రమించబడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
కాలనీ పాత రూపం – కొత్త వాస్తవం: నాడు కాలనీ కమిటీ హాల్ నుంచి చూస్తే ప్రధాన గేట్ స్పష్టంగా కనిపించేది. అయితే గతంలో ని నిర్లక్ష్యం, వ్యవస్థలో చొరబడిన అక్రమ ప్రభావాలతో ఇప్పుడు ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కాలనీ ప్రధాన రహదారి అంచున అక్రమ నిర్మాణాలు పెరగడంతో, ప్రధాన గేట్ కనిపించకుండా అడ్డుపడేలా ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికులు చెబుతున్నదేమిటంటే హెచ్ఎండిఏ లేఔట్ నిబంధనలను ఉల్లంఘించి, రోడ్డు పొడవులు, వెడల్పులు పట్టించుకోకుండా ఆక్రమణలకు సహకరించారు. ఇది చిన్న తప్పు కాదు, కాలనీ ప్రణాళికను మొత్తం దెబ్బతీసింది అని అన్నారు.
కాలనీ నివాసులు చెబుతున్న వివరాల ప్రకారం.. లే అవుట్ విషయంలో గత కమిటీలో పొరపాట్లు, రోడ్డు ఆక్రమణల విషయంలో నిర్లక్ష్యం చేశారని, కాలనీ నివాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ… ప్రస్తుత పాలక కమిటీ పారదర్శకతను చూపించి, అప్రూవల్ లేఔట్‌లో ఉన్నట్లు రోడ్ల ఫీట్ల వివరాలను బోర్డుపై స్పష్టంగా చూపించాలి అని కోరుతున్నారు. జిహెచ్ఎంసి అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ పెద్దలు స్వయంగా చొరవ చూపి రోడ్ల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటే, ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
అదేవిధంగా భవిష్యత్తులో క్రయ విక్రయాలు జరిగేటప్పుడు అనుమానాలకు తావివ్వకుండా, లేఔట్ మ్యాప్‌లో ఉన్న విధంగానే రోడ్లను సూచించాలనే డిమాండ్ చేస్తున్నారు. జిహెచ్ఎంసి అధికారులు ఇప్పటికే హెచ్చరించినట్లు, లేఔట్‌లో చూపిన వివరాలు స్పష్టంగా లేకపోతే, ఆ ప్రాజెక్టును గ్రామపంచాయతీ కచ్చా లేఔట్‌గా పరిగణిస్తాం అని పేర్కొన్న విషయం గుర్తు చేస్తూ, కాలనీ పాలక వర్గం ఈ తప్పిదాన్ని వెంటనే సరిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి