కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా నటించిన ‘కేడీ’ చిత్రం తాజాగా విడుదల చేసిన స్పెషల్ సాంగ్ “సర్కే చునార్ తేరీ సర్కే” సోషల్ మీడియాలో విపరీతమైన వివాదానికి కారణమైంది. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ పాటలో డబుల్ మీనింగ్ పదాలు, నోరా ఫతేహి డ్యాన్స్ మూవ్‌లు కొంతమందికి అసహ్యంగా, జుగుప్సాకరంగా అనిపించాయని నెటిజన్లు సోషల్ మీడియా వేదికలపై ఘోరంగా మండిపడ్డారు. పాట హిందీ వెర్షన్ సాహిత్యంపై ప్రజల ఆగ్రహం తీవ్రంగా వ్యక్తమైంది. ఈ క్రమంలో కేంద్రం కూడా సీరియస్ అవుతూ అన్ని సోషల్ మీడియా ఫార్మాట్స్ నుంచి ఈ పాటను తక్షణమే డిలీట్ చేయాలని ఆదేశించింది.
పాట సాహిత్యంపై పలువురు సినీ ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేయబడ్డాయి. ఈ పాటను హిందీలో సింగర్ మంగ్లీ పాడగా, పాటలోని అసభ్యకరమైన పదజాలం, అశ్లీలమైన అంశాలపై క్రికెటర్ హర్భజన్ సింగ్, గాయకుడు అర్మాన్ మాలిక్, నటిని కంగనా రనౌత్ తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. కొందరు సినిమా దర్శకుడు ప్రేమ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు.
ఇలాంటి ప్రతికూల ప్రతిస్పందనల మధ్య, దర్శకుడు ప్రేమ్ భార్య, ఒకప్పటి హీరోయిన్ రక్షిత ఘాటుగా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా సుదీర్ఘ నోట్ విడుదల చేసి, ఆమె అభిప్రాయం స్పష్టంచేశారు. “నాకు తెలుసు కొంతమంది నన్ను పోస్టులలో ట్యాగ్ చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను దీనిని సమర్థించినా, వ్యతిరేకించినా ఇది వ్యక్తిగత అభిప్రాయం పక్కన పెడితే తగినంత అర్థం చేసుకోవచ్చు. గతంలో ‘పీలింగ్స్’, ‘డ్రీమ్ వేకప్’, ‘చోలీ కే పీచే క్యాహై’ వంటి పాటలు వచ్చినప్పుడు ప్రజలకు అవి సాధారణంగా అనిపించాయి. శృంగార అంశాలతో కూడిన సినిమాలు వచ్చినప్పుడు కూడా ఎవరికీ ఏ ఇబ్బంది కలగలేదు. కానీ ఈ ఒక్క పాట విషయంలో ఇంత గందరగోళం ఎందుకు జరుగుతోందో అర్థం కాలేదు. నేను దీన్ని సమర్థించడం లేదు. కానీ ప్రజలు ఈ వివక్షను అర్థం చేసుకోవాలి అని పోస్ట్ పెడుతున్నాను” అని రక్షిత పేర్కొన్నారు.
“ఒకప్పుడు ప్రేమ్ ప్రతిభను మెచ్చుకున్నవారే ఇప్పుడు అతనిపై చెడుగా మాట్లాడుతున్నారు. గతంలో మంచి పాటలు ఇచ్చిన దర్శకులు ఒక్క పాట కారణంగా చెడ్డ రచయితలుగా, గిమ్మిక్ కోసం ఏది అయినా చేస్తారని సూచించడం సరికాదు. కొన్ని సినిమాలు పెద్ద విజయం సాధించకపోవడం అంటే వారు చెడ్డ దర్శకులు అని అర్థం కాదు. వారిని ప్రశ్నించే హక్కు మీకు ఉంది, కానీ అవమానించే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా అతనిపై చెడుగా మాట్లాడితే, అది వ్యక్తిగతమా అని ఆలోచించాల్సి ఉంటుంది,” అని పేర్కొన్నారు.
“నాకు నా భాష, నా ప్రజలంటే చాలా ఇష్టం. బహిరంగంగా ఒకరి గురించి మాట్లాడేటప్పుడు కనీస అవగాహన ఉండాలి. మాకు ప్రశ్నలు ఎదురవుతాయి, మాపై జోకులు వేస్తుంటారు. ఇది కేవలం ప్రేమ్ విషయంలో మాత్రమే కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా కొంతమంది నాపై చెడుగా వ్యాఖ్యలు చేస్తారు,” అని రక్షిత రాసుకొచ్చారు.
ALSO READ: ఆధార్‌కార్డ్ వివరాలు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు..
