వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ బలి!

ఒక్కరు కాదు.. ఇద్దరు వ్యక్తుల వేధింపులు ఓ మహిళ కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకున్నాయి.

ఒక్కరు కాదు.. ఇద్దరు వ్యక్తుల వేధింపులు ఓ మహిళ కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పర్వతగిరి మండలం సీత్యా తండాకు చెందిన అనిత అనే మహిళ కానిస్టేబుల్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ ఉండేది. ఉద్యోగ జీవితం ఒకవైపు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన వేధింపులు మరోవైపు ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి. చివరకు ఆ వేదన ఆమెను ఆత్మహత్య దిశగా నెట్టినట్లుగా కుటుంబ సభ్యులు, పోలీసులు పేర్కొంటున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. అనితను రెండు వేర్వేరు కోణాల్లో ఇద్దరు వ్యక్తులు వేధించినట్లు తేలింది. పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా ఒక వ్యక్తి మానసికంగా హింసించగా, మరో వ్యక్తి ఆర్థికంగా బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఇద్దరి మధ్య ఇరుక్కొని అనిత తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం.

అనితకు దూరపు బంధువైన రాజేందర్ అనే వ్యక్తి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమనపల్లి తండాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకుంటానని చెబుతూ విధుల్లో ఉన్న సమయంలో కూడా వీడియో కాల్స్ చేయాలని, ఫోన్ మాట్లాడాలని అతడు ఒత్తిడి చేసేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనిత స్పందించకపోయినా, మాట్లాడకపోయినా రాజేందర్ వేధింపులు కొనసాగినట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు అతనితో పెళ్లికి స్పష్టంగా నిరాకరించారు. దీంతో రాజేందర్ మరింత కక్ష పెంచుకుని అనితపై వేధింపులు పెంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో అనిత విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లో పరిచయమైన జబ్బర్ లాల్ అనే వ్యక్తితో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న సమయంలోనే పరిస్థితి మలుపు తిరిగింది.

రాజేందర్ జబ్బర్‌కు ఫోన్ చేసి అనితపై లేనిపోని తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో జబ్బర్ కూడా అనితపై అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం, మాటలతో బెదిరించడం ప్రారంభించాడు. ఈ పరిణామాలతో అనిత పూర్తిగా కుంగిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇద్దరి నుంచి ఫోన్ కాల్స్ ద్వారా నిరంతరం వేధింపులు ఎదుర్కొంటూ అనిత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. చివరకు రాజేందర్‌కు ఫోన్ చేసి తన జీవితం నాశనం చేశారని, తాను చనిపోతే వారిద్దరే కారణమని చెప్పినట్లు సమాచారం. అయితే అతడు నిర్లక్ష్యంగా స్పందించడంతో అనిత మరింత విచ్ఛిన్నమైంది. అనంతరం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అనితను సమీప ఆసుపత్రికి తరలించారు. కొంతసేపు చికిత్స అందించినప్పటికీ ఆమె పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జబ్బర్ లాల్, రాజేందర్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ALSO READ: ఈ ఫుడ్ కుక్కర్‌లో వండితే విషమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button