జాతీయం

జీఎస్టీ సవరణలతో జీడీపీకి జోష్.. ఆదాయం లోటు రాదన్న నిర్మలా

Nirmala Sitharaman: జీఎస్టీటీ రేట్ల సవరణతో కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి, ద్రవ్య లోటుకు ఎలాంటి ఇబ్బంది కలుగదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌. రేట్ల తగ్గింపుతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రూ.48,000 కోట్ల ఆదాయ లోటును.. పెరిగే వినియోగం, జీడీపీ వృద్ధి రేటు భర్తీ చేస్తాయని చెప్పుకొచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతం దగ్గర కట్టడి చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు.

జీడీపీలో మరింత వృద్ధి!  

జీఎస్టీటీ సంస్కరణలతో ఈ ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్న 6.3-6.8 శాతం జీడీపీ వృద్ధి రేటు లక్ష్యాన్నీ అధిగమించే అవకాశం ఉందని  సీతారామన్‌ వెల్లడించారు. ఈ సంస్కరణలను ప్రజా సంస్కరణలుగా అభివర్ణించారు. నిరుపేదలతో సహా దేశంలోని ప్రతి ఒక్క కుటుంబానికీ ఎంతో కొంత మేలు జరుగుతుందన్నారు. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనాన్నీ నిశితంగా గమనిస్తున్నట్టు సీతారామన్‌ తెలిపారు. ప్రధాన కరెన్సీలతో డాలర్‌ మారకం రేటు బలపడడమే ఇందుకు కారణమన్నారు.

పొరపాటు కారణంగా జరిగిందా?

అటు నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్  రోజువారీ నిత్యావసరమైన డిటర్జెంట్లు, కాస్మెటిక్స్‌, గృహోపయోగ ఇనిసెక్టిసైడ్స్‌ ను మాత్రం 18 శాతం శ్లాబులో ఉంచింది. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటై ఉండవచ్చని, తుది నోటిఫికేషన్‌ లో ప్రభుత్వం దీన్ని సవరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిపై జీఎస్టీ రేట్లు  తగ్గించి ఉంటే దేశంలో కాస్మెటిక్స్‌ అమ్మకాల వృద్ధి రేటుకు మరింత మేలు కలిగేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button