ఏపీ రాష్ట్రంలో గ్యాస్ కొరత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని రేషన్ కార్డు కలిగిన ప్రజలకు ఊరటనిచ్చే చర్యలు ప్రారంభించింది. ఇంధన సరఫరాలో తలెత్తిన అంతరాయాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ రేషన్ దుకాణాల ద్వారా కిరోసిన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రతి రేషన్ కార్డుదారుడికి లీటరు చొప్పున కిరోసిన్ అందించేలా ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం గ్యాస్ కొరత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 2800 కిలో లీటర్ల కిరోసిన్‌ను వినియోగిస్తూ ఈ పంపిణీ చేపట్టనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సరఫరాను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్.. హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో విశాఖపట్నానికి ఈ నెల 21వ తేదీన చేరాల్సిన గ్యాస్ నౌక 26వ తేదీన మాత్రమే చేరుతుందని కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని తెలిపారు. ఈ గ్యాస్ సరఫరా ఆలస్యంతో రాష్ట్రంలో కొంతకాలం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో, అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా కిరోసిన్ పంపిణీని పునఃప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కిరోసిన్ సరఫరా చేసినప్పటికీ, తర్వాత దాన్ని పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్రాన్ని కిరోసిన్ రహితంగా మార్చామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి వివరించారు. కేంద్రం నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం కిరోసిన్ పంపిణీని ముందుగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే రాష్ట్రంలో గ్యాస్ కొరత పూర్తిగా లేదని స్పష్టం చేస్తూ, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని చెప్పారు. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా ప్రారంభించామని, అవసరాల ప్రాధాన్యత ఆధారంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆస్పత్రులు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. కొన్ని వర్గాలు తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల ప్రజలు భయపడి అధికంగా బుకింగ్స్ చేస్తున్నారని పేర్కొంటూ, అలాంటి అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గ్యాస్ కొరత సమస్యను పూర్తిగా అధిగమించేందుకు ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం చర్చలు జరుపుతోందని చెప్పారు. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఓటీపీ విధానం ద్వారా మాత్రమే డెలివరీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అక్రమంగా గ్యాస్ నిల్వ చేయడం లేదా బ్లాక్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
