
తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కొద్ది గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత మరొకరు సమావేశం కావడం ఆసక్తి కలిగించింది. అయితే, ఈ సమావేశాలు ఎందుకు జరిగాయి అనే విషయంపై ఎలాంటి ప్రకటన రాలేదు. జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించనున్నారనే ప్రచారం కొనసాగుతోంది. ఇందుకు బలాన్ని చేకూర్చేలా అమిత్ షా జమ్మూకశ్మీర్ రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం అయినట్లు తెలుస్తోంది ప్రధాని మోడీ ఇవాళ(ఆగష్టు 5న) ఎన్డీయే ఎంపీలతో కీలక సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆగస్టు 5 ఆర్టికల్ 370 రద్దు చేసిన రోజు. ఈ నేపథ్యంలో ఏదైనా కీలక ప్రకటన రావచ్చని అందరూ ఊహిస్తున్నారు. ఇందుకు ముందస్తు కసరత్తులో భాగంగానే కీలక సమావేశాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అమిత్ షా వరుస సమావేశాలు
ఇప్పటికే జమ్మూకశ్మీర్ బీజేపీ మాజీ చీఫ్ సత్ పాల్ శర్మ, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తాతో అమిత్ షా సమావేశమయ్యారు. ఆల్ జమ్మూ అండ్ కశ్మీర్ షియా అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్రాన్ రజా అన్సారి సైతం తాజాగా షాను కలిశారు. ఢిల్లీలో వరుస సమావేశాల నేపథ్యంలో ఆగస్టు 5న కీలక ప్రకటన వెలువడే అవకాశాలపై చర్చ జరుగుతోంది. అయితే, కాశ్మీర్ లో శాంతి కోసం ఎన్నో విలువైన ప్రాణాలను కోల్పోయామని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని పలువురు రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శాంతి పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతున్నందున్న పరిస్థితి మొత్తం సానుకూలమయ్యేంత వరకూ వేచిచూడాలంటున్నారు. హడావిడి నిర్ణయం మంచిది కాదంటున్నారు. అటు కశ్మీర్, జమ్మూను వేరు చేసి రెండు వేర్వేరు రాష్ట్రాలుగా గుర్తిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇందులో వాస్తవం ఏంటనేది త్వరలో తెలియనుంది.
Read Also: నిజమైన భారతీయుడు అలా మాట్లాడడు.. రాహుల్ పై సుప్రీం ఆగ్రహం!