
Good News: రైతులకు ఎప్పటికప్పుడు భరోసా కలిగించే విధానాలు తీసుకువస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం ప్రకటించింది. ముఖ్యంగా వ్యవసాయ భూములను తరతరాలకు సాగుచేసే రైతు కుటుంబాల్లో భూమి హక్కుల పంపిణీ విషయంలో అనేక సమస్యలు ఎదురైనా.. వాటిని సులభతరం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబ పెద్ద మరణించిన తర్వాత వారసులకు ఆస్తుల విభజన ఎలా జరగాలి.. రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎంత ఉండాలి అనే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం ద్వారా రైతుల భారం తగ్గించే చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఇప్పటి వరకు వ్యవసాయ భూముల వారసత్వ విభజన రిజిస్ట్రేషన్‌లో ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. ఫీజులు భారంగా ఉండటం వల్ల అనేక కుటుంబాలు ఆస్తి పత్రాలు తమ పేర్లకు మార్చకుండా సంవత్సరాల తరబడి అలాగే ఉంచేవారు. ఫలితంగా భూములపై హక్కులతో పాటు రికార్డులు కూడా స్పష్టంగా ఉండకపోవడంతో భవిష్యత్‌లో అనేక వివాదాలకు దారి తీసేది. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం రైతుల అవసరానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ విధానంలో కీలక మార్పులను చేసింది.
కొత్త జీవో ప్రకారం.. కుటుంబ సభ్యుల మధ్య వారసత్వ వ్యవసాయ భూములను భాగపంపిణీ చేసుకునే సందర్భంలో రిజిస్ట్రేషన్ విలువ రూ.10 లక్షల లోపు ఉంటే కేవలం రూ.100 స్టాంపు డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. ఆస్తుల విలువ రూ.10 లక్షలకిపైగా ఉన్నా కూడా రైతులు కేవలం రూ.1,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇంత తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ చేయించే అవకాశం రావడంతో వేలాది కుటుంబాలకు భారీ ఉపశమనం కలిగే అవకాశం ఉంది.
వీలునామా రాయకుండా కుటుంబ పెద్ద మరణించిన పరిస్థితుల్లో భార్య, పిల్లలు ఆస్తులను తమ మధ్య పంచుకోవడం సహజం. అయితే, ఇలాంటి సందర్భాల్లో ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు, ఖర్చులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఈ ప్రత్యేక రాయితీలు ఇలాంటి వారసత్వభూములకే వర్తిస్తాయి, అది కూడా వ్యవసాయ భూములకు మాత్రమే పరిమితం అవుతుంది. అంటే ఇతర రకాల ఆస్తులకు ఈ రాయితీలు వర్తించవు.
ఈ నిర్ణయంతో రైతులు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఆటో మ్యూటేషన్ జరిగే విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. మ్యూటేషన్ ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరిగిపోవడం వల్ల అధికారులు వద్ద తిరగాల్సిన పనిలేకుండా నేరుగా పట్టాదారు పాస్‌బుక్స్ రైతుల పేర్లపై జారీ అవుతాయి. దీంతో భూములపై సంపూర్ణ హక్కులు రావడంతో పాటు భవిష్యత్‌లో పంటల కోసం రుణాలు తీసుకోవడం, సబ్సిడీలు పొందడం, భూమి రికార్డులను సరిచేయడం అన్నీ సులభతరమవుతాయి.





