
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. గిరిజన రైతుల భూములకు సాగునీరు అందించి, వారి ఆర్థిక స్థితిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ పథకం ద్వారా అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే గిరిజన రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలగనున్నాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పథకానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా నాబార్డ్ సంస్థ నుంచి రూ.600 కోట్ల రుణాలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నాబార్డ్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. రుణాల మంజూరుకు నాబార్డ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మార్చి నెలలోపు ఈ నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లోనే రూ.600 కోట్లు కేటాయించింది. ఇప్పుడు అదే స్థాయిలో నాబార్డ్ నుంచి కూడా నిధులు అందితే పథకం అమలు మరింత విస్తృతంగా సాగనుంది. ఈ రెండు వనరుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది గిరిజన రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుందని అధికారులు చెబుతున్నారు. నిధులు అందిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అర్హులైన గిరిజన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. అటవీ హక్కుల పత్రాలు కలిగిన రైతులకు ఈ పథకంలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పారదర్శక విధానంలో లబ్ధిదారుల ఎంపిక జరిగేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ స్కీమ్ కింద అటవీ హక్కుల పత్రాలు ఉన్న సుమారు 2.1 లక్షల మంది గిరిజన రైతుల ఆధీనంలోని దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడుతున్న గిరిజన రైతులకు ఇది గణనీయమైన ఊరట కలిగించనుంది. పథకం అమలులో భాగంగా ఒక్కో రైతుకు సుమారు రూ.6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, సోలార్ ప్యానెళ్లను ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో అందించనుంది. దీనివల్ల రైతులకు సాగునీరు సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా విద్యుత్ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గనున్నాయి.
సోలార్ విద్యుత్‌ను వ్యవసాయ అవసరాలకు వినియోగించిన తరువాత మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్ముకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించనుంది. ఈ మిగులు విద్యుత్ ద్వారా ప్రతి రైతు నెలకు సుమారు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అదనపు ఆదాయం పొందవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది గిరిజన రైతుల జీవన ప్రమాణాలను మార్చే కీలక అడుగుగా భావిస్తున్నారు. మొత్తంగా ఇందిర సౌర గిరి జల వికాసం పథకం గిరిజన రైతులకు సాగునీరు, విద్యుత్, అదనపు ఆదాయం అనే మూడు ప్రధాన ప్రయోజనాలు అందించనుంది. ఈ పథకం విజయవంతమైతే గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ రంగం కొత్త దిశలో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
ALSO READ: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఎప్పుడంటే?





