
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. కొంతకాలంగా గాయం కారణంగా షూటింగ్‌కు దూరంగా ఉన్న బాలయ్య.. ఇప్పుడు పూర్తిగా కోలుకుని తిరిగి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాదా’ చిత్రీకరణలో ఆయన పాల్గొంటున్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని మైసూరులో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది.
మైసూరులో జరుగుతున్న తాజా షెడ్యూల్‌ను చిత్రబృందం ఎంతో కీలకంగా భావిస్తోంది. ఈ దశలో టాకీ పార్ట్‌తో పాటు బాలకృష్ణ, ఇతర ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా నిర్మాణంలో మరో ముఖ్యమైన దశను మేకర్స్ పూర్తి చేయనున్నారు.
ఇటీవల కాకినాడలో ‘దాదా’ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న సమయంలో బాలకృష్ణకు కండరానికి స్వల్ప గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. అవసరమైన చికిత్సలో భాగంగా చిన్న శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. దీంతో షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.
బాలకృష్ణ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అప్పట్లో చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ వెల్లడించింది. చికిత్స అనంతరం ఆయన త్వరలోనే షూటింగ్లో పాల్గొంటారని తెలిపింది. తాజాగా అదే విధంగా బాలయ్య తిరిగి సెట్స్‌లోకి రావడంతో చిత్ర యూనిట్లో ఉత్సాహం పెరిగింది.
ఇక ‘దాదా’ విషయానికి వస్తే.. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ ఘన విజయం సాధించడంతో ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి కూడా బాలకృష్ణను మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే పవర్ఫుల్ పాత్రలో దర్శకుడు చూపించనున్నట్లు సమాచారం.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమాలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్, కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ‘దాదా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
also read: అగ్గిపెట్టి మచ్చా ఇక లేరు.. అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ కిరణ్ కుమార్ మృతి